Tue May 06 2025 08:29:21 GMT+0530 (India Standard Time)
Simhachalam Accident : సింహాచలం ప్రమాదం.. అధికారులదే తప్పా? ఇంకెవరినీ బాధ్యులు చేయరా?
సింహాచలంలో జరిగిన ప్రమాదం పూర్తిగా అధికారులపైకి నెట్టి వేస్తున్నారు.

సింహాచలంలో జరిగిన ప్రమాదం పూర్తిగా అధికారులపైకి నెట్టి వేస్తున్నారు. నలుగురు మంత్రులను మాత్రం బాధ్యులను చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవం జరుగుతుందని తెలుసు. అధికారులతో మంత్రులు నలుగురు కలసి అనేక సార్లు రివ్యూ చేశారు. ఆలయాన్ని పరిశీలించారు. అనేక సూచనలు కూడా చేశారు. చందనోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా అధికారులు ఎంత వ్యవహరించారో మంత్రులు కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని చెప్పాలి. ఎందుకంటే ఏడుగురు ప్రాణాలు గోడ కింద పడి నలిగి పోవడానికి కారణంపై లోతుగా అధ్యయనం చేయాలి. విజయవంతమయితే తమదే అని భుజాలు చరచుకునే మంత్రులు, అదే ఇలాంటి ఘటన జరిగితే మాత్రం తప్పంతా అధికారులపై నెట్టివేయడం ఫ్యాషన్ గా మారింది.
ఒకరిపై ఒకరు...
సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. కమిటీ ఆలయం వద్దకు వెళ్లి విచారణ ప్రారంభించింది. ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో వెళ్లిన త్రిసభ్య కమిటీకి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అయితే కమిటీ కూడా అంతా అధికారులదే తప్పిదమన్నట్లుగా తేల్చేటట్లు కనపడుతుంది. దేవాదాయ శాఖ, టూరిజం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ తో పాటు కాంట్రాక్టరు కూడా ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. తప్పు వారిదంటే వారిదంటూ ఒకరి వైపు మరొకరు వేలు చూపుతున్నప్పటికీ ఈ ప్రమాదానికి మాత్రం సమిష్టిగా అందరూ బాధ్యత వహించాలని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు.
అనుమతులు లేకుండా...
సరైన అనుమతులు లేకుండా పనులు పూర్తి చేయడం సింహాచలం దేవస్థానంలో మామూలు అని అక్కడి వారు చెబుతున్నారు. ఇంజినీర్లు తాము అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. తాత్కాలిక గోడను ఎవరు నిర్మించమన్నారంటే మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈవో సెలవుపై వెళ్లిపోవడం కూడా అనుమానాలకు తావిస్తుంది. ఇక మంత్రులు రివ్యూ చేసినప్పుడు ఈ తాత్కాలిక గోడ నిర్మాణం విషయం వచ్చిందా? రాదా? అన్నది తెలియకున్నా చంద్రబాబు నాయుడు మాత్రం గోడ నిర్మాణానికి అనుమతిచ్చిందెవరు? కాంట్రాక్టర్ ను హడావిడిగా కట్టాలని వత్తిడి తెచ్చిందెవరు? అన్న దానిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
Next Story