Wed Jul 23 2025 05:53:13 GMT+0530 (India Standard Time)
Ys Jagan : వరసబెట్టి జగన్ కోటరీ ఖాళీ అవుతుందా? కటకటాల వెనక్కు తప్పదా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అంత్యంత సన్నిహితులుగా ఉన్నవారంతా జైలు ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధంగా ఉండాల్సిందే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అంత్యంత సన్నిహితులుగా ఉన్నవారంతా జైలు ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. గత ఐదేళ్లలో జగన్ కు అనుకూలంగా ఉన్న అనేక మందిని ఇప్పటికే జైలుకు పంపారు. మద్యం స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి తో పాటు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు తాజాగా మిధున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అంటే జగన్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన వారు ఇదే కేసులో జైలులో ఉన్నట్లయింది. జగన్ కు అత్యంత ఆప్తులుగా గత ఐదేళ్లలో వ్యవహరించిన వారందరూ వరసగా జైలుకు వెళుతున్నారు.
అటవీ భూముల కేసు...
కేవలం మద్యం కేసు మాత్రమే కాదు.. అనేక కేసులు వరసగా వైసీపీ నేతలను చుట్టుముట్టేటట్లు కనిపిస్తున్నాయి. తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ తొలి నుంచి వైరంతో ఉన్నవాళ్లే. కళాశాలలో చదివే నాటి నుంచి వీరి మధ్య వైరం ఉందంటారు. అదే వైరం రాజకీయాల్లోనూ కొనసాగుతూ వచ్చింది. ఇక మద్యం స్కామ్ కేసులో కాకుంటే మరొక కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.
ఐదేళ్ల కాలంలో...
మరొకవైపు గత ఐదేళ్ల కాలంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించిన సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కేసులు వదిలపెట్టవన్నది వాస్తవం. ఆయనపై కూడా కేసులు నమోదు చేయడమే కాకుండా కటకటాలు లెక్కపెట్టిస్తారన్న టాక్ బలంగా వినపడుతుంది. ఐదేళ్ల పాటు తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు బనాయించడంలోనూ, పోలీసు అధికారులకు డైరెక్షన్ ఇవ్వడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ ఆయన అరెస్ట్ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అయితే ఊపందుకుంది. ఈ ఏడాదిలోనే ఈ కేసులన్నీ పూర్తిచేసి కీలమైన నేతలను అరెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
Next Story