Tue May 06 2025 09:34:05 GMT+0530 (India Standard Time)
Chandrababu : మహిళలు పక్క చూపు చూడకుండా చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. మరో పథకం జూన్ 12 గ్రాండ్ లాంచ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని ఒంటి చేత్తో ముందుకు తీసుకెళుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని ఒంటి చేత్తో ముందుకు తీసుకెళుతున్నారు. ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరొక వైపు సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వరసగా తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండటంతో ఆయనకు కొంత కలసి వచ్చింది. వేగంగా నిధుల మంజూరు జరుగుతుంది. రుణాల రూపంలోనైనా, గ్రాంట్ల రూపంలోనైనా వెంటనే విడుదల అయ్యేందుకు మార్గం సుగమమయింది. అయితే ఇప్పటికే ఏడాది పాలన పూర్తి కావచ్చింది. జూన్ నెల 12వ తేదీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఏడాది పూర్తి అవుతుంది.
కీలకమైన హామీని...
ఈ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంలో మరో కీలకమైన హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకం అమలు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఈ హామీని నెరవేర్చాలని, మహిళలను తమ వైపునకు తిప్పుకునేందుకు పూర్తిగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలంటే ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఇటీవల అధికారులు, మంత్రులతో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఈ పథకం వర్తింప చేయనున్నారు.
వీరే అర్హులు...
అయితే ఇందులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింప చేయనున్నారు. అంతే కాకుండా తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పద్దెనిమిదేళ్ల నుంచి యాభై ఎనిమిదేళ్ల లోపు మహిళలు ఎంత మంది ఉన్నారన్నది లెక్క తీయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అరవై ఏళ్లు దాటిన మహిళలకు ఎటూ నెలకు నాలుగు వేల రూపాయలు పింఛను వస్తుంది కాబట్టి వారికి మినహాయిస్తారు. మిగిలిన మహిళలు ఎంత మంది ఉన్నారు? వారి ఆర్థిక పరిస్థితి వంటి విషయాలపై సర్వే చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.
ఏడాదయిన సందర్భంగా...
ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ పథకాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. మహిళల ఓటు బ్యాంకు ను మరింత పటిష్టం చేసుకోవడం కోసం ఈ పథకాన్ని వీలయినంత త్వరగా తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ నెల లేదా వచ్చే నెలలో ఎటూ తల్లికి వందనం పథకం అమలు చేయనుండటంతో ఈ పథకం కింద కూడా పదిహేను వందలు ఇస్తే మహిళలు కూటమికి స్ట్రాంగ్ ఓటర్లుగా మారతారన్న అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తుండటంతో ఇక మహిళలు పక్క పార్టీల వైపు చూడకుండా వీలయినంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story