Tue May 06 2025 17:58:59 GMT+0530 (India Standard Time)
Chandrababu : మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇలాగైతే కష్టమేనంటూ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని తెలిసింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఏ పనిని అప్పగించినా సక్రమంగా చేయలేకపోతున్నారని ఆయన ఒకింత ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. సీనియర్ మంత్రుల నుంచి జూనియర్ల వరకూ మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తున్న చంద్రబాబు దాదాపు అరవై శాతం మంది మంత్రులు వారి వారి శాఖల్లో కొంత పట్టు సంపాదించినప్పటికీ జిల్లాల్లో ఇన్ ఛార్జి మంత్రులుగా వ్యవహరించడంతో పాటు కూటమి నేతల విభేదాలను తొలగించడం అలాగే టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదర్చలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాగయితే త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టి ప్రక్షాళన చేయాల్సి వస్తుందన్న హెచ్చరికలు మంత్రులకు నేరుగా పంపుతున్నారు.
వరస ఘటనలు జరుగుతున్నా...
ప్రధానంగా దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. వరసగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడం, తాజాగా సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఏడుగురు భక్తులు మరణించడంలో మంత్రుల పనితీరు సక్రమంగా లేకనే అని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు జిల్లా ఇన్ ఛార్జి మంత్రితో పాటు ఆ శాఖ మంత్రి కూలంకషంగా చర్చించి అన్ని రకాలుగా పరిశీలన చేయాల్సి ఉండగా, వీరు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈ రెండు ఘటనలకు కారణం అధికారుల వైఫల్యం ఎంత ఉందో మంత్రుల నిర్లక్ష్యం కూడా అంతే ఉందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు.
సఖ్యత లేని నియోజకవర్గాల్లో...
మరొకవైపు అనేక నియోజకవర్గాలలో టీడీపీ నేతల మధ్య సఖ్యత లేదు. పదవులు రాలేదని కొందరు, మరికొందరు తమకు ప్రాధాన్యత దక్కలేదని ఇలా అసంతృప్తిగా ఉన్నారని, కనీసం వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా మంత్రులు చేయడం లేదని చంద్రబాబు భావిస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఇన్ ఛార్జులుగా ఉన్న మంత్రులు తక్కువ సార్లు పర్యటనకు వెళుతుండటాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలాగయితే ఎలా పార్టీని ముందుకు తీసుకెళతామని ప్రశ్నిస్తున్నారు. మంత్రులు కేవలం తమ శాఖలకు మాత్రమే పరిమితం కాకుండా పార్టీతో పాటు మిగిలిన బాధ్యతలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నారు. కానీ మంత్రులకు ఎన్ని సార్లు చెప్పినా వారిలో మార్పు లేదని భావించిన చంద్రబాబు ఈ మేరకు వారికి లాస్ట్ వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
లంచ్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు...
ఇటీవల మంత్రులతో జరిగిన లంచ్ మీటింగ్ లోనూ కొందరు మంత్రులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారి పనితీరును మార్చుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. పార్టీ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టకుండా వారు అలా వెళ్లి వస్తున్నారని, ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీసినట్లు తెలిసింది. కడప జిల్లా మంత్రిపై కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అక్కడ ఏ నియోజకవర్గంలోనూ నేతల మధ్య సఖ్యత లేకపోవడాన్ని అందరికీ తెలుస్తుందని, దానిక ఏం చేశారని నేరుగా మంత్రినే ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాగయితే ఇక కష్టమని.. మార్చేయాల్సి ఉంటుందని, ఇదే ఆఖరి హెచ్చరిక అంటూ తీవ్రంగా చంద్రబాబు మందలించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story