Tue Jul 22 2025 02:50:08 GMT+0530 (India Standard Time)
TDP : ఎమ్మెల్యేలు చంద్రబాబును మించిపోయారుగా.. సుపరిపాలన కార్యక్రమంలో కొత్త అడుగులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్లాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారన్న దానిపై ఆయన ఆరా తీస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు గ్రహించారు. ఏదో రెండు, మూడు గడపలు తొక్కి నామ్ కే వాస్తేగా పాల్గొని, ఫొటోలు, వీడియోలను పోస్టు చేసి తిరిగి క్యాంప్ కార్యాలయానికి వెళుతున్నారని గుర్తించారని తెలిసింది. అటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు త్వరలోనే నేరుగా వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. వ్యక్తిగతంగా పనులను పక్కనపెట్టాలని చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదు.
సాంకేతికను అనుకూలంగా...
అందుకే నియోజకవర్గంలో ఎన్ని గడపలు ఎమ్మెల్యేలు టచ్ చేసింది లెక్కలు తెప్పించుకుని మరీ వారికి మెసేజ్ ల ద్వారా అలెర్ట్ చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ కార్యక్రమం ప్రారంభమయింది. నేటికి 20 రోజులు పూర్తయ్యాయి. ఈ ఇరవై రోజుల్లో యాభై ఐదు లక్షలకు పైగానే గడపలు దర్శించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇందులోనూ కొన్ని తప్పులున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. సాంకేతికతతో లెక్కలు తీద్దామనుకుంటుంటే దానికి తగ్గట్లుగా ప్రజాప్రతినిధులు కూడా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని తెలిసింది. దీంతో చంద్రబాబు నాయుడు త్వరలోనే సమావేశం పెట్టి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలిసింది.
ప్రజల నుంచి ఫిర్యాదులు...
మరొకవైపు కొందరు ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు ఛార్జీలపైనే ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల ఎదుటే ఈ కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తున్నట్లు ఫీడ్ బ్యాక్ వచ్చింది. విద్యుత్తు బిల్లులు భారంగా మారడంతో పాటు స్మార్ట్ మీటర్ల ను పెడితే తాము అంగీకరించబోమని కూడా కొందరు ఎమ్మెల్యేల ముందే తెగేసి చెబుతుండటం కూడా పార్టీ నాయకత్వం దృష్టికి వచ్చింది. దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా అర్హులైన కొందరికి అందడం లేదన్న ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఆ ఫిర్యాదులను సేకరించి నిజంగా అర్హత కలిగి ఉంటే వారికి వెల్ ఫేర్ స్కీమ్ లు అందించాలని అధికారులను ఆదేశించనున్నారు.
ఈ సమస్యలపైనే ఎక్కువగా...
ముఖ్యంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం పథకంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా తెలిసి వస్తుంది. గత ప్రభుత్వం తమకు పథకాలను అందించిందని, అయితే ఇప్పుడు ఏవేవో కారణాలు చూపుతూ తమను అనర్హులుగా చేయడమేంటని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా విద్యుత్తు ఛార్జీలు, తల్లికివందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లపైనే ఎక్కువగా వచ్చినట్లు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిపై మరొకసారి విచారించాలని అధికారులను కోరనున్నారు. అలాగే రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకపోవడంపై అసంతృప్తిని కూడా వెళ్లగక్కుతుండటంతో కేంద్రంతో పాటు తాము కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పాలని ప్రజాప్రతినిధులకు చెప్పినా వారు సరిగా ప్రజలకు చేరవేయడం లేదని భావించిన చంద్రబాబు తానే ప్రతి సమావేశంలో చెబుతున్నారట.
Next Story