Tue May 06 2025 07:30:25 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : బయలుదేరవా.. సామీ.. ఎప్పుడూ వాయిదానేనా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను త్వరలో జిల్లాల పర్యటనలు చేస్తానని ప్రకటించారు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను త్వరలో జిల్లాల పర్యటనలు చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన చేసి దాదాపు మూడు నెలలకు పైగానే అవుతుంది. అయితే పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటన మాత్రం ఖరారు కాలేదు. అప్పడుప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనూ, ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతంలోనూ పర్యటించి వచ్చిన పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటన ఊసే ఎత్తడం లేదు. జిల్లాల్లో పార్టీ నేతలు, జనసైనికులు అయితే పవన్ కల్యాణ్ ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తారా? అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆయన జిల్లాల పర్యటనలు చేస్తానని, త్వరలోనే తన పర్యటన ఖరారవుతుందని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంకా బయలుదేరడానికి మాత్రం ముహూర్తం ఖరారు చేయకపోవడం పై జనసైనికుల్లోనే అసంతృప్తి కనపడుతుంది.
కొంత అనారోగ్యం కారణంగా...
అయితే పవన్ కల్యాణ్ కొంత అనారోగ్యం కారణంగా జిల్లాల పర్యటన వాయిదా పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తరచూ ఆయన వెన్నునొప్పితో పాటు వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటంతో పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారు కాలేదంటున్నారు. అంతకు ముందు బాగా లేకపోయినా తమిళనాడులోని దేవాలయాలను సందర్శించి వచ్చిన పవన్ కల్యాణ్ తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతికి మాత్రమే ఎక్కువగా పరిమితమయ్యారు. తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలను కూడా విజయవాడలోనే ఎక్కువగా చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సమావేశాలు అంటే మంత్రి వర్గ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారన్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
పార్టీ ని బలోపేతం చేయడంపై...
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తనను ఆదరించిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనలకు కూడా ఆయన రాకపోవడంపై పెదవి విరుస్తున్నారు. జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తే ఇక్కడ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, కొత్త నేతల చేరికలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మరొకవైపు తమకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి కార్యక్రమాలను ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. టీడీపీ నేతలతో పోటీ పడి నియోజకవర్గంలో తాము కూడా కార్యక్రమాలను చేయాలంటే తమకు గైడెన్స్ ఇచ్చే వారి కోసం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వైపు చూడాల్సి వస్తుంది.
వేసవి తీవ్రత తగ్గిన తర్వాతే...
పవన్ కల్యాణ్ ఈ వేసవి తీవ్రత తగ్గిన తర్వాత మాత్రమే జిల్లాల పర్యటనకు వచ్చే అవకాశముందని మరొక ప్రచారం జరుగుతుంది. ఎండల తీవ్రతతో మరింత అనారోగ్యానికి గురవుతానని, అందులోనూ తాను వెళితే విపరీతంగా అభిమానులు, ఫ్యాన్స్ గుమికూడతారని, అందువల్ల తన పర్యటనలు శీతాకాలంలో పెట్టుకోవడమే మంచిదని భావిస్తున్నారు. తనకు సెక్యూరిటీ ఉన్నప్పటికీ వారు కూడా అదుపు చేయలేని పరిస్థితులు ఉంటాయని చెప్పడంతో జిల్లాల పర్యటనను వాయిదా వేసుకోవాలని సీనియర్ నేతల సూచనల మేరకు పోస్ట్ పోన్డ్ చేసుకున్నారని చెబుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ రాక కోసం సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ ఎదురు చూస్తున్న వారు మాత్రం నిరాశలో మునిగిపోయారు.
Next Story