Tue May 06 2025 17:36:51 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేతలను దారిలో పెట్టడం ఎలా? జగన్ రివర్స్ లో తగిలిన నిర్ణయాలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు క్యాడర్ ను రక్షించుకోవడం కంటే లీడర్లను కాపాడుకోవడం పెద్ద టాస్క్ గా మారింది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు క్యాడర్ ను రక్షించుకోవడం కంటే లీడర్లను కాపాడుకోవడం పెద్ద టాస్క్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో తాను అనుసరించిన పద్ధతులు ఇప్పుడు తనకే బెడిసి కొడతాయని ఊహించలేదు. వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ కానరాకుండా అక్రమ కేసులు బనాయించారు. కోడెల శివప్రసాద్ మరణం నుంచి అన్ని రకాలుగా జగన్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమతో పాటు చంద్రబాబు నాయుడును కూడా అరెస్ట్ చేసి జైలులో పడేశారు. అప్పట్లో ఆ కాసేపు ఆనందం అనుభవించినా దాని ఫలితం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా తెలుస్తుండటంతో కొంత ఇబ్బంది పడుతున్నారు.
కీలక నేతలపై కేసులు...
కీలక నేతలందరిపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్, జోగి రమేష్ లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. ఇంకా లైన్ లో కాకాణి గోవర్థన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు క్యూలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్ది రెడ్డి మిధున్ రెడ్డి తో పాటు ఆర్కే రోజా, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇలా వరసగా నేతలపై కేసులు నమోదవుతున్నాయి. కాకాణి గోవర్థన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మద్యం కేసులో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మెడపై కత్తి వేలాడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణ కేసులు నమోదువుతున్నాయి. పేర్ని నానిపై కేసు నమోదయినా ఆయన జైలుకు వెళ్లకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకు్నారు.
హైదరాబాద్, బెంగళూరులకే...
ఈ నేపథ్యంలో మిగిలిన నేతలు చాలా వరకూ మౌనంగానే ఉంటున్నారు. మరో నాలుగేళ్లు కూటమి ప్రభుత్వం కేసులను తట్టుకోవడం కష్టమని భావించి నియోజకవర్గాలకు దూరంగానే ఉంటున్నారు. వీరంతా హైదరాబాద్ లోనే ఎక్కువగా మకాం పెట్టారు. కొందరు బెంగళూరుకు వెళ్లి తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలపై కూడా భూకబ్జాల ఆరోపణలు రావడంతో ఎప్పుడైనా అదుపులోకి తీసుకునే అవకాశముందంటున్నారు. అయితే కొన్ని కేసుల్లో సజ్జల ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇంకా గత వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన వారిని ఎవరినీ వదలకుండా కేసులు పెడుతుండటంతో ఆ ప్రభావం మామూలు నేతలపై కూడా పడింది.
రైతులను పరామర్శించడానికి...
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నా నేతలు అందుబాటులో ఉండటం లేదు. క్యాడర్ కు సరైన డైరెక్షన్ చేసేవారు కూడా నియోజకవర్గంలో కరువయ్యారు. దీంతో వైసీపీ కీలకమైన నియోజకవర్గాల్లోనూ బలహీనంగా మారింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు నష్టపోయినా వారిని ఓదార్చేందుకు ఒకరిద్దరు నేతలు మినహా ఎవరూ పెద్దగా రియాక్ట్ కాకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ మరింతగా వీక్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో తాను బయటకు వస్తే తప్ప నేతలు సెట్ అయ్యే పరిస్థితి లేదు. కానీ తాను జిల్లాల పర్యటన చేసేందుకు ఇంకా జగన్ సమయం తీసుకుంటున్నారు. దీంతో నేతలను దారిలో పెట్టడం జగన్ కు పెద్ద టాస్క్ గా మారింది. మరి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
Next Story