Wed Jul 23 2025 05:52:23 GMT+0530 (India Standard Time)
Ap Liquor Scam : వైఎస్ జగన్ కు పిలుపు గ్యారంటీ.. కానీ ఎప్పుడన్నదే మాత్రం?
లిక్కర్ కేసులో తర్వాత చార్జ్ షీట్ లో మిథున్ రెడ్డితో పాటు బిగ్ బాస్ జగన్ పేరు ఉండే అవకాశముంది.

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వరకు వెళ్లి లిక్కర్ కేసు విచారణ ఆగింది. తర్వాత చార్జ్ షీట్ లో మిథున్ రెడ్డితో పాటు బిగ్ బాస్ జగన్ పేరు ఉండే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ కేసులో సాక్ష్యాధారాలను సేకరించిన సిట్ బృందం ప్రాధమిక ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. మద్యం విధానం నుంచి లోకల్ బ్రాండ్ తయారీ వరకు అన్ని అంశాలపై సిట్ అధికారులు నివేదిక సమర్పించారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను చార్జ్ షీట్ లో ఉంచిన సిట్ అధికారులు లిక్కర్ ముడుపుల పర్యవేక్షణ, డెన్ ల ఏర్పాటును సిట్ పొందుపర్చింది. దుబాయ్ తోపాటు హైదరాబాద్, తాడేపల్లి డెన్ ల ఫొటోలు సేకరించడమే కాకుండా నిందితులు ధ్వంసం చేసిన సెల్ ఫోన్లను ఐటీ నిపుణులతో డేటా రికవరీ చేసిన సిట్ అధికారులు కీలక డేటాను చార్జ్ షీట్ లో ప్రస్తావించారు.
వేల కోట్ల రూపాయల కుంభకోణం...
ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం కేసులో దాదాపు 3,200 కోట్ల రూపాయలు దారి మళ్లించారని సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇందులో కీలక విషయం ఏంటంటే జగన్ పేరును కూడా ఛార్జిషీట్ లో పలుసార్లు ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. జగన్ ఆదేశాలతోనే మద్యం విధానాన్ని గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ముడుపులు సేకరించడమే కాకుండా వాటిని గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల వ్యయం కోసం కొంత, మిగిలిన మొత్తాన్ని కొన్ని కీలక కంపెనీలకు పంపినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడయింది. మిధున్ రెడ్డి ఈ కేసులో ఎ4 నిందితుడిగా పేర్కొన్నప్పటికీ ఛార్జిషీట్ లో మాత్రం ఆయన పేరు ప్రస్తావించలేదు.
తర్వాత ఛార్జిషీట్ లో...
తర్వాత ఛార్జిషీట్ లో మిధున్ రెడ్డి పేరుతో పాటు జగన్ పేరును కూడా పెట్టాలన్న యోచనలో సిట్ అధికారులున్నట్లు సమాచారం. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో పదకొండు మంది అరెస్టవ్వగా మిధున్ రెడ్డి పన్నెండో వ్యక్తి. అయితే పదమూడో వ్యక్తిగా జగన్ ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. దాదాపు నలభై ఎనిమిది మంది వరకూ ఈ మద్యం స్కాం కేసులో ఉన్నట్లు పేర్కొన్న సిట్ కొందరి పేర్లను మాత్రమే ప్రాధమిక ఛార్జిషీట్ లో పొందుపర్చింది. ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ ెడ్డి, గోవిందప్ప బాలాజీ తో పాటు మరికొందరి పేర్లను మాత్రం ఛార్జిషీటులో ఎక్కడా ప్రస్తావించలేదు. తర్వాత పొందుపర్చే ఛార్జిషీట్ లో వీరి పేర్లను చేర్చే అవకాశముందని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
అరెస్ట్ ఖాయమంటూ...
అయితే జగన్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ముందుగా జగన్ ను సిట్ విచారణకు పిలిచి తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అసలు పాలసీని తయారు చేయడంతో పాటు ముడుపులను వివిధ మార్గాల ద్వారా పంపింగ్ చేయడంలో జగన్ పాత్ర ను మరింతలోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆయనకు పిలుపు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. జగన్ ను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడనేది మాత్రం ఇంకా తేలలేదు. జగన్ అరెస్ట్ సమయానికి ఇంకా పెద్ద సమయం ఉండదని మాత్రం సిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద జగన్ అరెస్ట్ తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది చూడాల్సి ఉంది.
Next Story