Tue May 06 2025 15:16:00 GMT+0530 (India Standard Time)
Weather Report : నేడు కూడా భారీ వర్షాలు తప్పవట.. వాతావరణం కూల్ గా ఉంటుందట
నేడు కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నేడు కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని తెలిపింది. బెంగాల్-ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈరోజు కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ ముఖ్యంగా అల్లూరి, ఏలూరు, కాకినాడ, తూ.గో. జిల్లాల్లో భారీ వర్షపడుతుందని అలాగే కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కడూా భారీవర్షం పడుతుందని తెలిపింది. దీంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 10 తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలిపింది.
నష్టపోయిన రైతులు...
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ తో పాటు మరికొన్నిజిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. మొన్న కురిసిన భారీ వర్షానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిసిపోయింది. తడిసిపోయిన ధాన్యాన్నికొనుగోలు చేయాలంటూ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అకాల వర్షం తమ నోటి కాడ కూడును తీసివేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా వరి, మామిడి, బత్తాయి వంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. మరొక వైపు అరటి తోటలు కూడా ధ్వంసమయ్యాయని, కొబ్బరిచెట్లు కూడా ఈదురుగాలులకు నేలకూలాయని, తమకు జరిగిన నష్టాన్ని ఎవరు చెల్లించాలంటూ కోస్తాంధ్రలోని రైతులు అలమటించిపోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది.
తెలంగాణలోనూ భారీ వర్షాలు...
తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు తెలంగాణలోని పదిహేడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదేసమయంలో ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో తగ్గవచ్చని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కూడా పేర్కొంది. ఎప్పటి లాగానే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సాయంత్రం వేళకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని, అకాల వర్షం ముంచెత్తే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశముందని పేర్కొంది.
Next Story