Tue May 06 2025 09:14:45 GMT+0530 (India Standard Time)
Narendra Modi : జగన్ జోలికి మోదీ వెళ్లనది అందుకేనా? ఇందులో మర్మమేంటి మహానుభావా?
ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడకు వెళ్లినా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడకు వెళ్లినా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తారు. తమిళనాడు వెళ్లినా, తెలంగాణకు వచ్చినా.. కేరళ వెళ్లినా తమకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు, ఆ పార్టీకి చెందిన నేతలపై విమర్శలు గట్టిగానే చేస్తారు. తమిళనాడు వెళితే స్టాలిన్ ను పేరెత్తకుండానే విమర్శలు చేస్తారు. ఇక తెలంగాణ వస్తే గతంలో బీఆర్ఎస్ ను, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టకుండా విమర్శలు చేయనిది పోరు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్లినా అక్కడ ప్రత్యర్థిని ఖచ్చితంగా విమర్శించకుండా ఆయన ప్రసంగం ఉండదు. గతంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు 2019 లో ఎన్నికల ప్రచారంలో నాడు తమ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబుపై మాత్రం విమర్శలు చేశారు.
మోదీ ప్రసంగం విన్న వారికి...
కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సమయంలో మాత్రం మోదీ మాట్లాడిన తీరును చూసిన వారికి ఎవరికైనా ఈ సందేహం కలగక మానదు. అమరావతి రాజధాని పనులకు కేంద్ర సహకారం ఉంటుందని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. ఏదైనా నిధులు ఇస్తారేమో అందరూ ఆశించారు. కానీ ఎటువంటి నిధుల మాట ఎత్తకుండానే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి మద్దతు ఉంటుందంటూ చెప్పి వెళ్లిపోయారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమరావతి రాజధానిని విధ్వంసంచేసిందని మాట్లాడారు. ఆ విషయం మోదీకి తెలియంది కాదు. మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ తెచ్చిన విషయమూ మోదీకి తెలుసు.
ప్రతి చోట ఫైర్ అయ్యే ప్రధాని...
కానీ నిన్న అమరావతికి వచ్చి బహిరంగ సభలో మోదీ మాత్రం జగన్ ను ఒక్క మాట అనలేదు. ఆయన ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అన్ని రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వారిపై ఫైర్ అయ్యే మోదీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి ఎందుకు జగన్ ను విమర్శించలేదన్న అనుమానం సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను ప్రశంసించారు. అంతవరకూ బాగానే ఉంది. ముగ్గురం కలసి రాజధాని నిర్మాణం చేద్దామని అన్నారు. అది కూడా ఓకే. కానీ జగన్ ను ఎందుకు విమర్శించలేదు. జగన్ పై ఎందుకు నేరుగా మోదీ ఆరోపణలు చేయలేకపోయారన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఏపీలో ప్రత్యేక పాలిటిక్స్...
నిజానికి ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి ప్రత్యేక పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించడంతో ఇక్కడ కాంగ్రెస్ విలన్ అయింది. అది చావుదెబ్బ తిని పదేళ్ల నుంచి లేవలేకపోతుంది. ఇక్కడ టీడీపీ, వైసీపీ రెండు మాత్రమే బలమైనవి. రెండు కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకునే సాహసం చేయలేవు. జగన్ గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మోదీకి రహస్య మిత్రుడిగానే చెలామణి అయ్యారన్న విమర్శల్లోనూ వాస్తవం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మిత్రుడు కావచ్చు. జగన్ కూడా అన్ని రకాలుగా మోదీ ప్రభుత్వానికి పరోక్షంగానైనా సహకరిస్తున్నారు. ఈ సమయంలో జగన్ పై విమర్శలు చేయకుండానే తన ప్రసంగాన్ని ముగించి ప్రధాని వెళ్లిపోయారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే మోదీ జగన్ ను పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పడానికే విమర్శలు చేయలేదని కూటమి నేతలు సర్దిచెప్పుకుంటున్నారు.
Next Story