Tue May 06 2025 16:17:19 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తెలుసుకోవాలనుందా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కావడంతో భక్తులు అంతగా లేరు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కావడంతో భక్తులు అంతగా లేకపోయినా దర్శన సమయం మాత్రం ఎక్కువగానే ఉంది. తిరుమలకు గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద నుంచే వాహనాలు ఎక్కువ సేపు నిలిచిపోతున్నాయి. వేసవి కాలం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన భక్తులు మాత్రమే కాకుండా తమిళనాడుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఈ భక్తులతో ...
ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులతో పాటు కాలినడకన వచ్చే భక్తులు, టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులతో పాటు నేడు తొలి మంగళవారం కావడంతో తిరుపతి, తిరుమలకు చెందిన స్థానికులకు కూడా ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేసి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో రద్దీ బాగానే ఉంది. అదే సమయంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సిఫార్సు లేఖలను కూడా రద్దు చేయడంతో శ్రీవారి దర్శనం సులువుగానే అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,095 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,912 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story