Tue Jul 22 2025 03:19:38 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో ఈ నెలలో అంత రద్దీ ఎందుకు ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినా భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినా భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోయాయి. నారాయణగిరి షెడ్డు కూడా నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. గత రెండున్నర నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల దర్శనం కోసం, వసతి గృహాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాత వసతి గృహాలకు వెంటనే మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులో తేవాలని నిర్ణయించారు. జులై నెలలో దర్శనం సులువుగా లభిస్తుందని అందరూ అనుకుని తిరుమలకు చేరుకోవడంతో రద్దీ పెరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వసతి గృహాల కోసం...
తిరుమలలో గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. జులై నెలలో సాధారణంగా భక్తుల రద్దీ కొంత తగ్గుతుంది. వర్షాలు పడటంతో పాటు పాఠశాలలు తెరుచుకుని ప్రారంభం కావడంతో కొత్త విద్యాసంవత్సరం మొదలు కావడంతో సహజంగా భక్తులు జులై నెలలో తగ్గుతారు. కానీ అందుకు విరుద్ధంగా ఈ ఏడాది జులైలో మాత్రం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. జూన్ నెలలో కూడా దాదాపు 120 కోట్ల రూపాయలకు పైగానే హుండీ ఆదాయం లభించింది. ఈ నెల కూడా అంతే స్థాయిలో వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ః
అన్ని కంపార్ట్ మెంట్లు...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ రెండు కిలోమీటర్ల బయట వరకూ విస్తరించింది. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పథ్నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 87,138 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,099 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
Next Story