Wed Dec 10 2025 08:09:47 GMT+0530 (India Standard Time)
Turakapalem Deaths : తురకపాలెంలో వరస మరణాలకు కారణాలు అవేనా.. భయపెడుతున్నట్లే జరిగిందా?
గుంటూరు జిల్లాలో వరస మరణాలు కలకలం రేపుతున్నాయి. గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో గత ఎనిమిది నెలల సమయంలో 32 మంది మరణించారు

గుంటూరు జిల్లాలో వరస మరణాలు కలకలం రేపుతున్నాయి. గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో గత ఎనిమిది నెలల సమయంలో 32 మంది మరణించారు. అయితే వీరి మరణాలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వరస మరణాలతో తురకపాలెం గ్రామంలో ప్రజలు భయాంధోళనలకు గురవుతున్నారు. గుంటూరు జిల్లా తురకపాలెం ఎస్సీ కాలనీలో దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే వీరంతా తాగు నీటి కోసం ఒక క్వారీ కుంటను ఉపయోగిస్తుండటాన్ని గుర్తించారు. అయితే కలుషిత నీటిని తాగడం వల్ల మరణించారా? మరేదైనా కారణమా? అన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తాగు నీరు కలుషితం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
స్వల్ప అనారోగ్యం పాలైనా...
ఎనిమిది నెలల్లో మరణించిన ముప్ఫయి రెండు మందిలో నలభై నుంచి యాభై వయస్సులోపు ఉన్నవారే. అయితే గత కొన్నాళ్లుగా వరస మరణాలు సంభవిస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో చలనం కలగడం లేదు. జర్వం వచ్చి, స్వల్ప అనారోగ్యం పాలైన వారు కూడా మరణిస్తుండటంతో గ్రామానికి ఏదైనా శని, పీడ పట్టిందేమోనని పూజలు కూడా నిర్వహించారు. తురకపాలెంలో వరస మరణాలపై ప్రభుత్వం కూడా ఆలస్యంగా స్పందించడంపై గ్రామస్థులతో పాటు వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు రూరల్ మండలంలో ఉన్న ఈ తురకపాలెంలో మిస్టరీ మరణాల వెనక కారణాలను బయటకు తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
వైద్య బృందాలు చేరుకుని...
గత కొన్ని రోజుల నుంచి వరస మరణాలు తురకపాలెంలో సంభవిస్తున్నా రెండు రోజుల క్రితమే వైద్య ఆరోగ్య శాఖ బృందాలు గ్రామానికి చేరుకున్నాయి. ఇంటింటి సర్వే చేపట్టారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతనే కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. రక్షిత మంచినీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అదే సమయంలో బెల్ట్ షాపులు కూడా తొలగించాలని గ్రామస్థులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. జ్వరాలు, కీళ్లనొప్పులు, దగ్గు వంటి ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో తురకపాలెంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలానికి కారణమయింది. మరి ఈ మరణాలకు గల కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.
Next Story

