Tue May 06 2025 14:51:45 GMT+0530 (India Standard Time)
Simhachalam Accident : గోడ కూలడానికి కారణం ఆ ఏడుగురేనట
సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. గత నెల 29వ తేదీన చందనోత్సవం సందర్భంగా సింహాచలం దేవస్థానంలో భక్తులపై గోడ కూలి ఏడుగురు మరణించడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి బాధ్యులు ఎవరన్న దానిపై ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సింహాచలంలో పర్యటించిన త్రిసభ్య కమిటీ కాంట్రాక్టర్ తో పాటు ప్రత్యక్ష సాక్షులను, ఇంజినీరింగ్ అధికారులను కూడా విచారించింది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం యాక్షన్ లోకి దిగింది.
పందొమ్మిది మందిని విచారించి..
మొత్తం పందొమ్మిది మందిని విచారించిన త్రిసభ్య కమిటీ భారీ గోడను చందనోత్సవం జరగడానికి ఐదు రోజులు ముందే నరి్మించారని గుర్తించింది. ఆ పక్కనే మూడు వందల రూపాయల భక్తుల క్యూ లైన్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ భారీ గోడ నిర్మాణ:లో ఎలాంటి డిజైన్లను ఇంజినీరింగ్ అధికారులు రూపొందించలేదని తేల్చింది. అలాగే గోడ నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వలేదని విచారణలో స్పష్టమైంది. కనీసం గోడ నిర్మాణంలో ఇంజినీరింగ్ నిబంధనలు కూడా పాటించలేదని, పూర్తిగా నిర్లక్ష్యం వహించారని త్రిసభ్య కమిటీ తేల్చింది. కేంద్ర ప్రభుత్వం" ప్రసాద్" పథకం కింద ఈ గోడను హడావిడిగా చందనోత్సవానికి ముందు నిర్మించడం కూడా గోడ కూలిపోవడానికి కారణంగా గుర్తించారు.
బాధ్యులను తేల్చి...
అయితే దీనికి బాధ్యులు ఎవరో కూడా త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈవో కె. సుబ్బారావు సెలవుపై వెళ్లడాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది. దీంతో ఈ ఘటనకు ఇన్ ఛార్జి ఈవో కె. సుబ్బారావు, సింహాచలం ఇంజినీరింగ్ అధికారి డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ మూర్తి, జేఈఈ కె. బాబ్జీ, ఏపీటీడీసీకి చెందిన రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్ ఆర్ స్వామి, ఏఈ మదన్ మోహన్ లను బాధ్యులుగా గుర్తించింది. దీంతో వీరు ఏడుగురిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కాంట్రాక్టరు లక్ష్మణరావును కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. త్రిసభ్య కమిటీ మొత్తం ఆరు పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించిన వెంటనే దానిని పరిశీలించి చర్యలు తీసుకుంది. కాంట్రాక్టరు, అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఆదేశించింది.
Next Story