Tue May 06 2025 08:45:49 GMT+0530 (India Standard Time)
Tadipathi : తేల్చుకుందాం రా.. పంచెలు పైకి ఎగ్గట్టి.. మీసాలు మెలేసీ మరీ..తాడిపత్రిలో టెన్షన్
తాడిపత్రి రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ మరింత ముదిరాయి

తాడిపత్రి రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ మరింత ముదిరే అవకాశమునట్లే కనిపిస్తుంది. మరోవైపు తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఆయన మరో రెండు రోజుల్లో తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ పోలీసుల ఆంక్షలతో తాడిపత్రిలోకి పెద్దారెడ్డి అడుగుపెట్టలేదు. అయితే న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తాడిపత్రికి వచ్చేందుకు సిద్ధం కావడంతో టెన్షన్ క్రియేట్ అయింది. మరోవైపు పోలీసులు కూడా బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందోనని చూస్తున్నారు.
నాడు దాడులు చేసి...
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డీ దమ్ముంటే రా అంటూ పంచె పైకి ఎగకట్టి మరీ సవాల్ విసిరారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిదే పైచేయి అయింది. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నట్లే వ్యవహరించారు. తర్వాత 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో సీన్ రివర్స్ అయింది. నాటి నుంచి రెండు వర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్నాయి. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన జేసీ అనుచరులు ఆయన ఇంట్లోని ఫర్నీచర్ ను కూడా ధ్వంసంచేశారు.
ఆంక్షలు ఎత్తివేయడంతో...
దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుందని భావించి ఆయన రాకపై ఆంక్షలు విధించారు. అనంతపురంలోనే పెద్దారెడ్డి ఉంటున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే తనను తాడిపత్రికి వెళ్లనీయడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరీ పర్మిషన్ తెచ్చుకున్నారు. తన అనుచరులతో కలసి రెండు రోజుల్లో తాడిపత్రిలోకి అడుగుపెడతానని పెద్దారెడ్డి చెబుతున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి ధీటైన కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రికి రా.. చూసుకుందాం.. ఎవరు ఏంటో తేల్చుకుందాం.. అంటూ సవాల్ విసిరారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చినా తాను తాడిపత్రికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
జేసీ తాజా వార్నింగ్ తో...
తాడిపత్రికి వస్తే తేల్చుకుందామంటూ తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే మరోసారి హింస చెలరేగే అవకాశముందని భావించిన పోలీసులు భారీగా మొహరించారు. ఒక వైపు న్యాయస్థానం ఆదేశాలు, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని, ఇద్దరూ సంయమనం పాటించి ఎవరి రాజకీయాలు వారు చేసుకోవడం మంచిదని కొందరు సూచిస్తున్నా.. వినేది ఎవరు.. వాళ్లిద్దరూ ఒకరు పెద్దారెడ్డి.. మరొకరు ప్రభాకర్ రెడ్డి. అందుకే తాడిపత్రిలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Next Story