Tue May 06 2025 09:10:52 GMT+0530 (India Standard Time)
Chandrababu : అందుకేనయ్యా నాలుగు సార్లు సీఎం అయింది.. ఓపికకు హేట్సాఫ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకే నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకే నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన నిత్యం జనంలో ఉండేందుకు ఇష్టపడతారు. ఎన్నడూ పార్టీ కార్యాలయంలోనో, తన ఆఫీసులోనో కూర్చుని ఉండటం ఆయనకు చేతకాదు. 1995లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ అదే జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ కొంత అలసట తో పాటు అలసత్వం కూడా వస్తుంది. కానీ చంద్రబాబు లో ఈ రెండు కానరవావు. ఒకరకంగా అదే చంద్రబాబు నాయుడు సక్సెస్ సీక్రెట్ అని చెప్పాలి. ప్రజల్లో ఉండాలని పరితపించడమంటే మామూలు విషయం కాదు. తాను చేయలేని విషయాలను చేయలేనని చెప్పే గట్స్ కూడా లీడర్ అనే వారికి ఉండాలి. అది చంద్రబాబులో పుష్కలంగా ఉన్నాయి.
24 X 7 అందుబాటులో...
1995లో అంటే అప్పుడు కొద్దిగా ఓపిగ్గా ఉండబట్టి ప్రతి రోజూ జిల్లాలు తిరిగే వారు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 24 X 7 అందుబాటులో ఉండేందుకే ప్రయత్నిస్తారు. ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను జరపుకునేందుకు యూరప్ పర్యటనకు వెళ్లి ఐదు రోజులు గడిపి ఢిల్లీకి వచ్చారు. అర్ధరాత్రి ఢిల్లీకి చేరినా ఉదయం నుంచి కేంద్ర మంత్రులతో వరసగా సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సంబంధించి, అనేక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఒంగోలులో హత్యకు గురయిన వీరయ్య చౌదరి అంతిమ సంస్కారంలో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మళ్లీ విశాఖకు వెళ్లి కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించారు.
లోకేశ్ ను పంపించి అయినా...
నిజానికి ఈ పనులు ఆయన చేయకపోయినా పార్టీ నేతలను లేదా లోకేశ్ ను పంపే వీలుంది. కానీ చంద్రబాబు మాత్రం స్వయంగా వెళ్లి ఈ రెండు ఘటనలకు హాజరై వచ్చిన విషయం అందరినీ అబ్బుర పర్చింది. ఈ స్టామినా నేటి యువతరం నేతలకు ఎందుకు లేదు? అన్న కామెంట్స్ బలంగా వినిపించాయి. ఆయన ఓపికకు హేట్సాఫ్ చెప్పితీరాల్సిందేనని అంటున్నారు. మొన్నటి వరకూ అంటే గత ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా ఇలా పర్యటనలు చేయలేదు. తక్కువలో తక్కువగా ఏదైనా బహిరంగ సభకు మాత్రమే హాజరయ్యేవారు. కానీ చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తల హత్య జరిగినా, మరో ఘటన జరిగినా తానే స్వయంగా వెళ్లి పాల్గొనడంతో ఆయన పట్ల మరింత క్రేజ్ పెరగడానికి కారణమయింది.
ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చాలు...
ఇక మొదటి తేదీ వచ్చిందంటే చాటు... చంద్రబాబు కాళ్లు ఒక పట్టాన నిలవవు. నిజానికి తాను స్వయంగా వెళ్లి పింఛన్లు అందచేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే పింఛను మొత్తాన్ని తాను వచ్చిన తర్వాతనే ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలకు పెంచారు. దీనికి పెద్దగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరమూ లేదు. అయినా సరే ప్రతినెల మొదటి తారీఖు వచ్చిందంటే చాలు.. వెంటనే ఏదో ఒక జిల్లాలో వాలిపోతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు ఇంటికి వెళ్లి పింఛను ఇస్తారు. అంతటితో ఆగకుండా వారి ఇంట్లోనే టీ తయారు చేసి అందరికీ ఇస్తారు. ఈరోజు కూడా ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతున్నారు. వాస్తవానికి రేపు మోదీ పర్యటన ఉన్నందున తాను వెళ్లకుండా ఉండే అవకాశమున్నప్పటికీ తన డైరీని మాత్రం ఆయన మార్చరే మార్చరు. అందుకు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించడమే ఉదాహరణ. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ప్రచారం కోసమే చేస్తున్నారని విమర్శలున్నప్పటికీ ఆ ఓపిక దేశంలో ఏ రాష్ట్రంలోని ముఖ్యమంత్రికి లేదని స్పష్టంగా చెప్పొచ్చు.
Next Story