Tue May 06 2025 07:07:09 GMT+0530 (India Standard Time)
Kinjarapu : రామ్మోహన్ నాయుడు టీడీపీలో కీలకంగా మారారా?
కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు టీడీపీలో ప్రధానంగా మారారు

కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు టీడీపీలో ప్రధానంగా మారారు. కేంద్ర మంత్రి పదవి చిన్న వయసులోనే దక్కడం ఒక ఎత్తైతే.. చంద్రబాబు గుడ్ లుక్స్ లో రామ్మోహన్ నాయుడు ఉన్నారన్నది వాస్తవం. ఇక అదే సమయంలో లోకేశ్ టీంలోనూ కింజారపు రామ్మోహన్ నాయుడు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. అందుకే రామ్మోహన్ నాయుడుకు ఎనలేని ప్రాధాన్యత ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ లభిస్తుంది. ఢిల్లీలో కూడా గతంలో మాదిరిగా సీనియర్ నేతలకు అవకాశమివ్వకుండా కింజారపు రామ్మోహన్ నాయుడుకు మాత్రమే చంద్రబాబు బాధ్యతలను అప్పగించారు. టీడీపీ పార్లమెంటు సభ్యులను ఏకతాటిపైకి తీసుకు వెళ్లడం దగ్గర నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులను రాబట్టడంలో రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని, అదే విధంగా ప్రాజెక్టులను కూడా వేగంగా గ్రౌైండ్ కావడంలో కృషి చేస్తున్నారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.
వారసత్వాన్ని అందిపుచ్చుకుని...
రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు ఉన్నప్పుడు కూడా పార్టీలో కీలకంగా ఉండేవారు. ఆయన కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు మరణం తర్వాత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నఆయన తనయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు 2014 నుంచి వరసగా మూడు సార్లు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014, 2019, 2024లో వరసగా హ్యాట్రిక్ విజయాలను సాధించి తండ్రి బాటలోనే కింజారపు రామ్మోహన్ నాయుడు నడుస్తున్నాడని చెప్పాలి. రామ్మోహన్ నాయుడు 2014లో గెలిచినప్పటికీ నాడు విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు పౌరవిమానయానశాఖ దక్కడంతో పాటు సీనియర్ నేతలకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
యంగ్ టీం ను ...
అయితే 2024లో మాత్రం యంగ్ టీంను ప్రోత్సహించడంలో భాగంగా కింజారపు రామ్మోహన్ నాయుడును కేంద్ర మంత్రి పదవికి ఎంపిక చేశారు. కింజారపు కుటుంబంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండగా, బాబాయి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడును అసలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావించినా అచ్చెన్నాయుడు ఇద్దరం అసెంబ్లీకి ఎందుకని అనడంతో రామ్మోహన్ ను పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయించారంటారు. అయినాసరే కింజారపు రామ్మోహన్ నాయుడుకు లోకేశ్ దగ్గర కావడంతో ఆయనకు తొలి విడత మంచి ప్రయారిటీ లభించింది. తొలి నుంచి పార్టీని నమ్ముకుని అంటిపెట్టుకుని ఉన్న కుటుంబం కావడంతో వారికి ప్రాధాన్యం ఇచ్చి యువతకు అవకాశమిచ్చారు చంద్రబాబు నాయుడు.
ఢిల్లీకి చంద్రబాబు వచ్చినప్పుడు...
కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ఢిల్లీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళితే కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్స్ నుంచి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్స్ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పుడు ఢిల్లీకి చంద్రబాబు వచ్చిన ఆయన పర్యటనలో కింజారపు రామ్మోహన్ నాయుడు ఉంటారు. అదే ఆయనకు ఇచ్చే ప్రాధాన్యత అనుకోవచ్చు. అదే సమయంలో తనకు అప్పగించిన బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుండటం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడం కూడా రామ్మోహన్ నాయుడుకు అవకాశం తెచ్చిపెట్టినట్లు పలువురు చెబుతున్నారు. మొత్తం మీద ప్రస్తుతం చంద్రబాబు విశ్వసించే నేతల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు ముందు వరసలో ఉంటారన్నది మాత్రం వాస్తవం. ఒకరకంగా చెప్పాలంటే లోకేశ్ తర్వాత రామ్మోహన్ నాయుడును చంద్రబాబు బాగా ఇష్టపడతారంటారు.
Next Story