Tue May 06 2025 10:31:39 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్.. ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనా? మూడేళ్లకు ముందు నుంచే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. శింగనమల నియోజకవర్గంలో వైసీపీ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో జగన్ అతి విశ్వాసంతో చేసిన ప్రయోగం వికటించింది. అది టీడీపీకి వరంగా మారింది. 2019 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికయ్యారు. అయితే ఆమెకు 2024 టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించారు. శింగనమల నియోజకవర్గంలో వైసీపీ నేతల్లో తలెత్తిన విభేదాల కారణంగా జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో 2024 ఎన్నికల్లో ఆమెను కాదని శింగనమల నియోజకవర్గం టిక్కెట్ ను వీరాంజనేయులుకు ఇచ్చారు. ఆయన టిప్పర్ డ్రైవర్ గా ఉన్నప్పటికీ జగన్ తన బొమ్మతో నైనా వీరాంజనేయులు గెలుస్తారన్న నమ్మకంతో టిక్కెట్ ఇచ్చారు.
టిప్పర్ డ్రైవర్ కు...
వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని, చంద్రబాబు ఏ టిప్పర్ డ్రైవర్ కైనా ఇచ్చాడా? అంటూ రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారంలో జగన్ పెద్దయెత్తున ప్రచారం చేశారు. తాను పేదల పక్షపాతినని, పార్టీ కోసం కష్టపడిన వారికి టిక్కెట్లు ఇస్తామని, అదే సమయంలో అన్ని సామాజికవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా డబ్బును చూడనని, కేవలం చట్ట సభలకు తీసుకెళ్లి వారి గొంతును వినిపించడమే లక్ష్యమని బిల్డప్ ఇచ్చారు. అయితే వీరాంజనేయులు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిపై వైసీపీ అభ్యర్థి ఎం. వీరాంజనేయులు దాదాపు ఆరువేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వీరాంజనేయులు పార్టీ ని నియోజకవర్గంలో బలోపేతం చేయలేకపోతున్నారు.
శైలజానాధ్ కే టిక్కెట్...
అయితే వీరాంజనేయులు స్థానంలో తిరిగి జొన్నలగడ్డ పద్మావతిని తీసుకువస్తారని భావించినా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సాకే శైలజానాధ్ పార్టీలో చేరడంతో ఆయనకు శింగనమల నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. సాకే శైలజనాధ్ కు మంచి పేరు ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకంటూ సొంత వర్గం అంటూ ఉంది. అందుకే జొన్నలగడ్డను, వీరాంజనేయులును పక్కనపెట్టి వచ్చే ఎన్నికల్లో సాకే శైలజానాధ్ కు టిక్కెట్ హామీ జగన్ ఇచ్చేశారంటున్నారు. ఆయనైతే గెలుపు సులువవుతుందన్న నమ్మకంతో జగన్ శైలజానాధ్ కు పార్టీలో కూడా కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నారంటున్నారు.
మూడేళ్లకు ముందు నుంచే...
ఇక అనేక నియోజకవర్గాల్లో ప్రయోగాలకు దూరంగా ఉండాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలిసింది. పాత నేతలతో పాటు నియోజకవర్గాల్లో క్యాడర్ తో టచ్ లో ఉన్న నేతలకు అక్కడే టిక్కెట్లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తన బొమ్మ పనిచేయదని భావించిన జగన్ నియోజకవర్గాల వారీగా ముందు నుంచే అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఎన్నికలకు మూడేళ్లకు ముందుగానే ప్రకటిస్తే జనంలోకి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయగలరన్న విశ్వాసంతో జగన్ ఉన్నారు. శింగనమల వంటి నియోజకవర్గాలు మాత్రమే కాకుండా గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మారచిన వారిని కూడా వారి పాత స్థానాలకు పంపేయోచనలో జగన్ ఉన్నారని తెలిసింది.
Next Story