Tue May 06 2025 08:05:34 GMT+0530 (India Standard Time)
YSRCP : దువ్వాడను ఆలస్యంగానైనా వదిలించుకున్నారా? లేకుంటే ఇది కూడా డ్రామానేనా?
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నాయకత్వం దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై వరసగా ఫిర్యాదులు రావడంతోనే శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రకటనలో తెలిపింది. అయితే ఇది ఒక నాటకంగా ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి. ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పుడు తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా దువ్వాడను తప్పిస్తేనే జనం నమ్ముతారంటున్నారు.
అనంత బాబు విషయంలోనూ...
గతంలోనూ ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలోనూ ఇదే జరిగిందన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో నాడు అనంతబాబు జైలుకు వెళ్లారు. నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దళిత వ్యక్తిని చంపడమే కాకుండా తన కారులోనే పార్శిల్ చేసి ఇంటికి తీసుకు వచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన వైనం అప్పట్లోనే సంచలనం కలిగించింది. అయితే అనంతబాబుపై పార్టీ పరంగా చర్యలు తీసుకున్న వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ పదవి నుంచి మాత్రం వేటు వేయలేకపోయింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పనిచేయకపోవడంతో ఆ ఘటన పార్టీ ఓటమికి ఒక కారణంగా మారిందనే చెప్పాలి.
కొత్తగా జరిగింది కాదే...
ఇక దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కొత్తగా జరగట్లేదు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న తంతు ఇది. దాదాపు ఏడాది కాలం నుంచి ఈ డ్రామా నడుస్తుంది.దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు ఆయన ఇంటివద్ద ఆందోళనకు దిగారు. .దువ్వాడ శ్రీనివాస్ తో వాణి వివాహమయింది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే గత కొంత కాలం నుంచి ఇద్దరూ విడిపోయి ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకు ముందు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. ఓటమి పాలు కావడంతో ఆయనకు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత 2024 ఎన్నికల్లో టెక్కలి సీటును కూడా దువ్వాడ శ్రీనివాస్ కే జగన్ కేటాయించారు. దీంతో పాటు మాధురి అనే మహిళతో బయట చక్కెర్లు కొడుతున్నారు. అయినా సరే ఇప్పటి వరకూ పార్టీ చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇంతకాలం వెయిట్ చేసి...
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో రచ్చ మొదలయింది. ఇది టెక్కలిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అయింది. పార్టీకి కూడా తలనొప్పిగా మారింది. ఒక ఎమ్మెల్సీగా ఉండి భార్యకు విడాకులు ఇవ్వకుండా దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నారని ఆయన భార్య వాణి ఆరోపిస్తున్నారు. ఆమె ట్రాప్ లో పడి తమను పూర్తిగా వదిలేశారంటున్నారు. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి కలసి టూర్లు చేస్తున్నారు. అయినా పార్టీ పట్టించుకోలేదు. తిరుమలలోనూ ఫొటో షూట్ వివాదంగా మారింది. అయినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేట వేయడం డ్రామాగానే చూడాల్సివస్తుందని, పార్టీకి ఉత్తరాంధ్రలో జరుగుతున్న డ్యామేజీని కాపాడుకోవడానికే ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేశారంటూ కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో నిజం కూడా ఉంది కదా?
Next Story