Tue May 06 2025 08:03:50 GMT+0530 (India Standard Time)
YSRCP : ఉత్తరాంధ్ర ఊడ్చి పెట్టుకుపోయినట్లేనా? కోలుకునే అవకాశం లేనట్లుందే?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అక్కడి నేతలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. శాసనమండలిలో నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మినహా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఏ వైసీపీనేత వాయిస్ వినిపించడం లేదు. ఎందుకో తెలియదు కానీ.. మొదటి నుంచి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి సౌండ్ లేకుండా పోయింది. తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ తో పాటు పలువురు కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో అసలు ఉత్తరాంధ్రలో పార్టీ ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
32 నియోజకవర్గాలలో...
ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలను సాధించిన ఫ్యాన్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా డీలా పడిపోయింది. విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటికీ అక్కడి ప్రజలు ఏ మాత్రం సానుకూలంగా వైసీపీ పక్షాన నిలవలేదు. భూ కబ్జాలు, ఆక్రమణలతో పాటు అనేక విషయాలు పార్టీకి ఓటమిని తెచ్చి పెట్టాయన్న అభిప్రాయం వైసీపీలోనే వ్యక్తమవుతుంది. ఇచ్ఛాపురం నుంచి విశాఖ వరకూ కూటమి పార్టీలు దాదాపుగా క్లీన్ స్వీప్ చేశాయనే చెప్పాలి. శ్రీకాకుళంలో పది, విజయనగరంలో తొమ్మిది, విశాఖలో పదిహేను శాసనసభ నియోజకవర్గాలు ఉండగా మొత్తం ముప్పయి నాలుగు స్థానాలుండగా మొన్నటి ఎన్నికల్లో కూటమికి మూడు జిల్లాల్లో ముప్ఫయి రెండు స్థానాలు రాగా, వైసీపీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అది కూడా ఎస్.టి నియోజకవర్గాలే కావడం గమనార్హం. ఈసారి ఈప్రాంతంలో నియోజకవర్గాలు పెరిగే అవకాశముంది.
సీనియర్ నేతలున్నా...
ఇటీవల మాజీ మంత్రి కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాలకు జగన్ కన్వీనర్ గా నియమించారు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సీనియర్ నేతలుండటంతో వారిని కలుపుకుని పోవడం కూడా కన్నబాబుకు కష్టంగా మారిందంటున్నారు. అదే సమయంలో సీనియర్ నేతలు ఎవరూ పార్టీకి కష్టపడి పనిచేసి పూర్వ వైభవం తేవాలన్న ఉద్దేశ్యంలో అయితే మాత్రం లేరనే అర్థమవుతుంది. తమకు విశ్రాంతి దొరికిందని ఇంట్లోనో, లేక హైదరాబాద్ లోనో విశ్రాంతి తీసుకుంటున్నారు తప్పించి పార్టీని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేయడం లేదు. కూటమి పార్టీల్లో ఉన్న లొసుగులను కూడా వారు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేయడం లేదంటే వారు ఎంతటి నిరాసక్తతలో ఉన్నారో చెప్పకనే అర్థమవుతుంది.
మొహం చాటేసే వారే...
విశాఖపట్నంలో అతి తక్కువ ధరకు భూములను కొత్తకంపెనీకి అప్పజెప్పినా కనీసం ఉద్యమం చేయాలన్న ధ్యాస వారిలో కనిపించ లేదంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుంది. అధికారంలో ఉండగా అంతా మాదే అన్నట్లు వ్యవహరించిన వారు సయితం ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఈ పరిస్థితిపై కనీసం వైఎస్ జగన్ కూడా ఫోకస్ పెట్టడం లేదు. వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తుందని, ఒక ప్రాంతంలో వచ్చి మరొక ప్రాంతంలో మరొకలా ఉండదని జగన్ భావించి లెక్కలు వేసుకుని మౌనంగానే ఉంటున్నారని తెలిసింది. జగన్ కామ్ గా ఉన్న వైనాన్ని చూసి నేతలు ఎవరూ బయటకు అస్సలు రాకపోవడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ పూర్తిగా పడకేసిందన్నది వాస్తవం.
Next Story