Sun Jul 27 2025 00:10:18 GMT+0530 (India Standard Time)
Gold Rates Today : లక్షకు దిగిరానంటున్న బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పసిడి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు ఇంకా పెరుగుతాయన్న గత కొంత కాలంగా చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే డిమాండ్ తగ్గినా ధరలు తగ్గకపోవడం మాట అటుంచి ఇంకా ధరలు పెరుగుతాయన్న అంచనాలు కొనుగోలుదారులను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలంటే కష్టమేనని అనిపిస్తుంది.
శ్రావణ మాసంలో...
ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైగానే ఉంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఇక మంచి ముహూర్తాలు ఉండటం, వివాహాలతో పాటు శుభకార్యాలు జరగనుండటంతో బంగారానికి మరింత డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. భారతీయ సంస్కృతిలో శుభకార్యాల సమయంలో బంగారం, వెండి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాద్యం వంటి కారణాలతో ప్రతి రోజూ ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది.
స్వల్పంగా తగ్గి....
బంగారం అంటే ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా బంగారం కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధర పై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన మేరకు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,090 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,470 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,27,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story