8 ఏళ్ల క్రితం కూలీ.. ఇప్పుడేమో ఏకంగా 500 కోట్లు దోచేశాడు
సంపన్నులే లక్ష్యంగా కోట్లలో మోసాలకు పాల్పడుతున్న రొనాల్ సల్దానా అనే వ్యక్తిని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

సంపన్నులే లక్ష్యంగా కోట్లలో మోసాలకు పాల్పడుతున్న రొనాల్ సల్దానా అనే వ్యక్తిని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. 600 కోట్ల వరకు అప్పులు ఇప్పించగల సత్తా ఉందని, ప్రభుత్వంలోనూ మంచి పలుకుబడి ఉందని నమ్మించాడు. ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ క్లియరెన్సుల పేరిట ఒక్కొక్కరి నుండి 50 లక్షల నుంచి 4 కోట్ల వరకు లాగేసినట్లు పోలీసులు గుర్తించారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరిట కూడా మరికొందరిని మోసం చేశాడు. 500 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన రొనాల్డ్ భారీ ఇంటిని నిర్మించుకున్నాడు. 2016 వరకు కూలి పనులు చేసుకుని బతికాక, ఎనిమిదేళ్ల కాలంలో అత్యంత సంపన్నుడిగా ఎదిగాడు. రుణం ఇప్పించేందుకు కోట్లలో పీజులు తీసుకున్న తర్వాత మొబైల్ స్విచ్ ఆప్ చేసుకోవడం, పని కాలేదని, త్వరలో అవుతుందని వాయిదాలు వేయడం చేసేవాడు. పోలీసుల రాకను ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి, రహస్య గదిలోకి వెళ్లి దాక్కునే వాడు. పలుమార్లు అరెస్టు నుండి తప్పించుకున్నాడు. కేవలం మూడు నెలల కాలంలో రొనాల్డ్ బ్యాంకు ఖాతాలో 40 కోట్ల రూపాయలు వచ్చి చేరాయని పోలీసులు గుర్తించారు.