Tue Jul 22 2025 02:56:46 GMT+0530 (India Standard Time)
బిక్షగాళ్లు కాదు.. గిరిజనులే కుబేరులు
నెల్లూరులోని యాక్సిస్ బ్యాంకులో గిరిజనుల పేరిట పదికోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఘటన వెలుగు చూసింది

కుబేర సినిమా కథ శేఖర్ కమ్ముల మదిలో ఎలా మొదలయిందో తెలియదు కానీ నెల్లూరులోని కొందరు మాత్రం కుబేర స్క్రిప్ట్ ను ముందుగానే రచించినట్లు తేలింది. అచ్చం కుబేర మూవీ తరహాలోనే అమాయకులైన వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం, వారి ఖాతాల్లో నగదు జమ చేయించడం, తర్వాత వాటిని దోచుకోవడం ఇలా పది కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. కుబేర సినిమాలో శేఖర్ కమ్ముల బిక్షగాళ్లను ఇందుకోసం ఎంచుకుంటే నెల్లూరులో మాత్రం అమాయక గిరిజనులను తమ సంపాదనకు పావులుగా మార్చుకున్నారు.
యాక్సిస్ బ్యాంకు కేంద్రంగా...
నెల్లూరులోని యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా 10.60 కోట్ల మేర జరిగిన కుంభకోణం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గిరిజనులకు సాఫ్ట్ వేర్ మేకప్ వేసి, బ్యాంకు సిబ్బంది జాయింట్ ఆపరేషన్ తో రుణాలను తీసుకున్నారు. అమాయక గిరిజనులను సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి... సుమారు 56 మంది పేరిట రుణాలను తీసుకన్నారు. వీరి పేరిట కొన్ని ఫేక్ కంపెనీలను కూడా మాయగాళ్లు ఏర్పాటు చేశారు. ఆ కంపెనీల్లో గిరిజనులను అందులో ఎంప్లాయిస్ గా రికార్డ్స్ క్రియేట్ చేసి వారి పేరుపై రుణాలను తీసుకున్నారు.
సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులుగా...
ఫేక్ కంపెనీలో నుంచి ఆరు నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్ట్ మెంట్లు కూడా తయారు చేశారు. దీంతో యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకోవడానికి కేటుగాళ్లకు సులువుగా మారింది. 2022 -2024 మధ్య జరిగిన ఈ కుంభకోణం జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అయితే రుణాలు చెల్లించాలంటూ గిరిజనులకు నోటీసులు రావడంతో ఈ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు నోటీసులపై ఆశ్చర్యపోయిన గిరిజనులు తమ నాయకుడు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. స్కామ్ కు పాల్పడింది వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అని గుర్తించారు. వీరితో పాటు మరో ఆరుగురు మీద ముత్తుకూరు పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story