Tue May 06 2025 09:09:12 GMT+0530 (India Standard Time)
వీరయ్య చౌదరి హత్య కేసులో నెల రోజుల నుంచి రెక్కీ.. డైలీ కార్యక్రమాన్ని పరిశీలించి మరీ?
ఒంగోలులో జరిగిన వీరయ్య చౌదరి హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఒంగోలులో జరిగిన వీరయ్య చౌదరి హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వీరయ్య చౌదరిని హత్య చేయడానికి దాదాపు నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించారని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఒంగోలులోని ఒక లాడ్జిలోనే ఉన్న నిందితులు వీరయ్య చౌదరి డైలీ కార్యక్రమాలను ఎప్పటికప్పడు పరిశీలిస్తూ ఆయన ఒంటరిగా ఉండే సమయాన్ని కూడా తెలివిగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. నెల రోజుల పాటు ఒంగోలులోని ఒక లాడ్జీలో ఉండి పరిశీలించిన తర్వాత మాత్రమే వీరయ్య చౌదరి ప్రతి రోజూ కార్యాలయానికి వస్తారని భావించి అక్కడే హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు.
ప్రత్యర్థులు పథకం ప్రకారమే...
వీరయ్య చౌదరి హత్య ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. టీడీపీ అధికారంలో ఉండగా ఆయనను చంపడానికి ప్రత్యర్థులు ఎందుకు ప్రయత్నించారన్న దానిపై పోలీసులు లోతుగా విచారించారు. ఆర్థిక లావాదేవీలు, వీరయ్య చౌదరి వల్ల తమకు జరిగిన నష్టాన్ని భరించలేక భవిష్యత్ ఇక తమకు ఉండదని, ఈ నాలుగేళ్లు తమ ఆదాయం కోల్పోయే అవకాశముందని భావించి సుపారీ ఇచ్చిన దుండగులు వీరయ్య చౌదరిని హత్య చేయించారని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. మద్యం షాపులు, చేపల చెరువల వేలం విషయంలో వీరయ్య చౌదరితో తలెత్తిన వివాదమే హత్యకు గల కారణాలుగా పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
ప్రత్యేక బృందాలు...
వీరయ్య చౌదరి కేసులో అనుమానితులుగా వీరగంధం దేవేంద్రనాద్, ముప్పవరపు సురేష్ లుగా పోలీసులు దాదాపుగా నిర్ణయించి వీరికి సహకరించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరికొందరి కోసం గాలిస్తున్నారు. నిందితుల కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. త్వరలోనే ఈ హత్య కేసును ఛేదించి నిందితులను మీడియా ముందు నిలబెడతామని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో జరిగిన నష్టంతో వీరయ్య చౌదరిని అంతమొందించాలని నిర్ణయించుకున్న నిందితులు పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ చేపట్టారు.
Next Story