Tue May 06 2025 11:47:55 GMT+0530 (India Standard Time)
Veeraiah Choudary Murder Case : వీరయ్య చౌదరి హత్య కేసులో మరో ట్విస్ట్.. సుపారీ మొత్తం చెల్లించకుండానే హత్య?
ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో అనేక ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి

ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో అనేక ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. గత నెల 22వ తేదీన వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటికీ ఇప్పటి వరకూ నిందితుల అరెస్ట్ అనేది అధికారికంగా జరగకపోవడంపై టీడీపీ నేతలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి వచ్చి ఆదేశాలు ఇచ్చినా ఈ నిర్లక్ష్యమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే నిందితులు చాలా తెలివిగా వ్యవహరించి ఏ మాత్రం ఆధారాలు లభించకుండా తప్పించుకు వెళ్లారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొందరు నిందితులు ఈ కేసులో వారంతట వారే పోలీసుల ఎదుట లొంగిపోయారని చెబుతున్నప్పటికీ ఇంకా అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు.
పెద్ద కర్మ లోపు అరెస్ట్ లు చేస్తారా?
ఈ నెల 8వ తేదీన వీరయ్య చౌదరి పెద్ద కర్మ జరుగుతుందని, ఈ లోగానైనా అరెస్ట్ చేస్తారా? లేదా? అని సోషల్ మీడియాలో ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు హత్యకు సూత్ర ధారి ఎవరనేది తెలిసినా అతనని కూడా ఇంత వరకూ పట్టుకోక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు కొలిక్కి వస్తుందని పోలీసులు చెబుతున్నా ఆధారాలు లేకండా హడావిడిగా కేసును ముగించామని చెబితే అది రేపు న్యాయస్థానాల్లో నిలబడదని పోలీసు అధికారులు చెబుతున్నారు. అందుకోసమే వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా తాము విచారించి, అందుకు అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నామని చెబుతున్నారు.
ప్రతి కత్తిపోటుకు ఇంత మొత్తమంటూ...
మరొక వైపు వీరయ్య చౌదరి లో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ విషయాలు బయటకు పొక్కకుండా పోలీసు ఉన్నతాధికారుల చర్యలు తీసుకుంటున్నారు. లేకుంటే నిందితులు జాగ్రత్త పడతారని భావిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కేసులో కీలక సూత్రధారి వినోద్ కు సురేష్ ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించడాని, అయితే సుపారీ గ్యాంగ్ కు మాత్రం వినోద్ ఇప్పటి వరకూ రెండు లక్షలు మాత్రమే చెల్లించారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరో కీలకమైన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతను దొరికితే కాని ఆధారాలతో పాటు వాంగ్మూలం కూడా లభించదనిచెబుతున్నారు. పోటు పోటుకు ఇంత మొత్తం చెల్లిస్తామని చెప్పడంతోనే వీరయ్య చౌదరిని దారుణంగా హత్య చేశారని తర్వాత సుపారీ గ్యాంగ్ కు రెండులక్షలతోనే సరిపెట్టారన్న వార్తలు వస్తున్నాయి. మరి పోలీసు అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులను బయటకు తీసుకు వచ్చి విచారణ చేస్తే తప్ప అసలు వాస్తవాలు బయటకు రావని అంటున్నారు.
Next Story