Tue Jul 22 2025 02:48:39 GMT+0530 (India Standard Time)
Telangana : భూ వివాదాలే హత్యలకు దారితీస్తున్నాయా? కాల్పుల కేసులు పెరుగుతున్నాయిగా?
తెలంగాణలో వరస హత్యలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. భూముల ధరలు భారీగా పెరగడంతో హత్యలు జరుగుతున్నాయని అర్థమవుతుంది

తెలంగాణలో వరస హత్యలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు భూముల ధరలు భారీగా పెరగడంతో హత్యలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రాజకీయ నేతలతో పాటు భూములను ఆక్రమించుకున్న వారితో పాటు ఆస్తి వివాదాలు, భూ తగాదాలు కూడా అనేక హత్యలకు కారణమవుతున్నాయి. గతంలో ఈ పరిస్థితులు లేవని ఒక్కసారిగా భూముల ధరలు పెరగడంతో పాటు దానిని సొంతం చేసుకోవడానికి ప్రత్యర్థిని లేపేసేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నారు. కోట్ల రూపాయల భూములు చేజారిపోతుండటంతో హత్యలకు దారి తీస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. పక్కాగా రెక్కీ నిర్వహించి స్కెచ్ వేసి మరీ కాల్పులు జరిపి తమను భూముల విషయంలో ఇబ్బందులు పెడుతున్న వారిని లేపేస్తున్నారు.
చందూరాధోఢ్ కాల్పుల కేసు కూడా...
మలక్ పేట్ కాల్పుల కేసును తీసుకుంటే...ఇక్కడ జరిగిన చందు రాథోడ్ హత్య కేసులో కూడా భూ వివాదాలే కారణమని చెబుతున్నారు. శాలివాహన నగర్ లోని పార్కులో వాకింగ్ చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. చందూరాథోడ్ అక్కడిక్కడే మరణించారు. మొత్తం ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు. అందులో ఐదు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంపాలన్న స్కెచ్ వేసి మరీ దుండగులు కాల్పులు జరిపారు. అయితే భూ వివాదాలు ప్రధాన కారణంగా గుర్తించారు. చందు రాథోడ్ ఒక స్థలంలో సీపీఎం నేతగా పేదల చేత గుడెసెలు వేయించి తమ ఆస్తిని కాజేసే ప్రయత్నం చేశారన్న కోణంలో ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు విచారణలో ప్రాధమికంగా తేలింది. చందు రాథోడ్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పాల్గొన్నారు. వీరంతా రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించి మరీ ఆయనను పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్పులు జరిపి హత్య చేశారు.
అనిల్ హత్య కూడా...
ఇక మెదక్ జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో కూడా భూవివాదాలు కారణమని అంటున్నారు. అనిల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాడు. అనతి కాలంలోనే రియల్ వ్యాపారం చేశారు. సెటిల్ మెంట్లు చేస్తూ ఇటీవల అనిల్ భద్రత కోసం కొందరు బౌన్సర్లను కూడా నియమించుకున్నారు. లిటిగేషన్ ఉన్న భూములను సెటిల్ చేయడంతో పాటు భూవివాదంలో ఎక్కువ సొమ్ములు డిమాండ్ చేయడం కూడా అనిల్ హత్యకు కారణమని చెబుతున్నారు. ఏపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి మనవడితో తలెత్తిన భూ వివాదాలే అనిల్ హత్యకు దారితీశాయన్నది పోలీసుల విచారణలో తేలింది.అ యితే ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అనిల్ కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో సుపారీ ఇచ్చి మరీ కొందరిని నియమించి అనిల్ ను హైదరాబాద్ నుంచి మెదక్ వెళుతుండగా కాల్చిచంపారు. ఇలా తెలంగాణలో భూమి ధరలు పెరుగడం హత్యలకు దారితీస్తున్నాయని, సెటిల్ మెంట్లు చేసేవారితో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలు ఈ హత్యలు చెబుతున్నాయి.
Next Story