Wed Dec 10 2025 11:48:44 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా మొబైల్ ఫోన్స్ ఇస్తామని ఎలాంటి ప్రకటన చేయలేదు
జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ

Claim :
ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా మొబైల్ ఫోన్స్ ఇస్తామని ప్రకటన చేశారుFact :
వైరల్ అవుతున్న వాదనలు అవాస్తవం. ప్రధాని అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు
జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధానికి తిరిగి వచ్చారు. నవంబర్ 22-23 తేదీలలో జోహన్నెస్‌బర్గ్‌లో తన అధికారిక పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ బహుళ శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యారు. అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన దేశాలు ప్రపంచ సమానత్వం, పునర్నిర్మాణం, స్థిరమైన అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉన్న 122 పాయింట్లను ఆమోదించాయి.
G20 సమ్మిట్ మూడవ సెషన్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. AI పట్ల భారతదేశం విధానాన్ని కూడా మోదీ హైలైట్ చేశారు. AI ప్రయోజనాలు ప్రతి మూలకు, భాషకు చేరేలా చూడటం భారతదేశ AI మిషన్ లక్ష్యమని, AI దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రపంచ ఒప్పందాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు.
అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా మొబైల్స్ ఇస్తున్నారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నరేంద్ర మోదీ విజువల్స్ తో పాటూ, పలు బ్రాండ్స్ కు సంబంధించిన మొబైల్స్ ను బాక్సుల్లో నుండి బయటకు తీయడం ఈ వీడియోలలో చూడొచ్చు. "Free Mobile from Modi Sarka" అంటూ పోస్టులు పెడుతున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో ఏదైనా ఉచిత స్మార్ట్‌ఫోన్ పథకాన్ని ప్రకటించారా అని తెలుసుకోడానికి ప్రయత్నించాం. అయితే ఈ వాదనకు మద్దతు ఇచ్చే మీడియా నివేదికలు లేదా అధికారిక ప్రకటనలు మాకు కనిపించలేదు.
ప్రధానమంత్రి మోదీ నిజంగా అలాంటి పథకాన్ని ప్రకటించి ఉంటే, ఆ విషయాన్ని పలు మీడియా సంస్థలు నివేదించి ఉండేవి.
కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రచురించే https://www.myscheme.gov.in/ వెబ్ సైట్ ను కూడా మేము పరిశీలించాం. ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్ ఫోన్స్ ను ఇస్తున్నట్లుగా ప్రకటనలు లభించలేదు.
వైరల్ వీడియోలను నిశితంగా పరిశీలించగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన పెదవి కదలికలకు ఆడియో సరిపోలడం లేదని మేము గమనించాము. వీడియోలను ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. మేము సంబంధిత ఏఐ టూల్స్ ను వాడి వైరల్ వీడియో లోని వాయిస్ నరేంద్ర మోదీదా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. రిజల్ట్స్ ఫేక్ అనే తేల్చాయి.
Hiya Deepfake వాయిస్ డిటెక్టర్ వైరల్ వీడియోలో ఉన్న నరేంద్ర మోదీ వాయిస్ డీప్ ఫేక్ అని తేల్చాయి. ఆ స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు.
ఇక ఈ వైరల్ వీడియోల కీఫ్రేమ్‌లను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అసలైన వీడియో మాకు లభించింది.
ఫిబ్రవరి 24, 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం నుండి విజువల్స్ ను తీసుకుని డీప్ ఫేక్ వాయిస్ ను జోడించారని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా మొబైల్ ఫోన్స్ ఇస్తామని ప్రకటన చేశారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

