Sun Jul 27 2025 01:11:50 GMT+0530 (India Standard Time)
Telangana : మరికొద్దిసేపట్లో కుండపోత వర్షం...వాతావరణ శాఖ హైఅలెర్ట్
తెలంగాణలో మరికొన్ని గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది

తెలంగాణలో మరికొన్ని గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ వాసులకు కూడా భారీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతవరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణాలోని కొన్ని జిల్లాలకు భారీ వర్షం పడుతుందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుందని, సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు ముందుగానే కార్యాలయాల నుంచి బయలుదేరి ఇళ్లకు చేరుకుంటే మంచిదని పోలీసు అధికారులు చెబుతున్నారు.
గత నాలుగు రోజుల నుంచి...
హైదరాబాద్ లో గత నాలుగు రోజుల నుంచి సాయత్రం వేళకు భారీ వర్షం కురుస్తుంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచి పోవడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. ఎక్కడి వాహనాలు అక్కడే గంటల కొద్దీ ట్రాఫిక్ లో నిలిచిపోతున్నాయి. మాదాపూర్ లో సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరిన ఉద్యోగులు రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం ప్యారడైజ్ కాలనీ, పైగా కాలనీల్లో వరద నీరు ఇంట్లోకి చేరుకోవడతో వస్తువులన్నీ నీటిలో తడిసి పోయాయి. దీంతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. నాలాలు పొంగి ప్రవహిస్తుండటంతో వరద నీటితో కలిసి మురుగు నీరు కూడా ఇళ్లలో చేరి దుర్గంధం నెలకొంది.
ఇళ్ల నుంచి బయటకు రావద్దని...
దీంతో దోమల బెడద కూడా హైదరాబాద్ లో తీవ్రమయింది. ఈ పరిస్థితులతో హైదరాబాద్ నగరంలో డెంగ్యూ వ్యాధి కూడా ప్రబలుతుంది. అనేకమంది డెంగూ వ్యాధితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో పాటు వైరల్ ఫీవర్స్ తో పాటు జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి వర్షం వీడకపోతే హైదరాబాద్ నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఆకాశం కారు మబ్బులు కమ్ముకుని కారు చీకట్లు అలుముకుంటున్నాయి. చలి వాతావారణం నెలకొని ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Next Story