Wed Dec 10 2025 08:54:48 GMT+0530 (India Standard Time)
ఇండోనేషియోలో ఘోర అగ్ని ప్రమాదం – 20 మంది మృతి
ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం ఏడు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇరవై మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.ఈరోజు మధ్యాహ్నం సమయంలో మొదటి అంతస్తు నుంచి మంటలు సోకాయని సెంట్రల్ జకార్తా పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా మరికొందరు బయటకి వెళ్లారని తెలిపారు. భవనం మొత్తం మీదికి మంటలు వ్యాపించడంతో ప్రాణనష్టం సంభవించిందని చెప్పారు.
గాలింపు చర్యలను...
మంటలను పూర్తిగా ఆర్పేసిన తర్వాత కూడా భవనం లోపల మరింతమంది ఉన్నారేమోనన్న అనుమానంతో సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తమ దృష్టంతా బాధితుల బయటకు తీయడంపైనే ఉందని, మంటలను ఆర్పే పనులపైనే ఉందని పోలీసులు తెలిపారు. భవనం టెరా డ్రోన్ ఇండోనేసియా కార్యాలయం. మైనింగ్ నుంచి వ్యవసాయ రంగాల వరకు ఏరియల్ సర్వేలకు డ్రోన్లు అందించే సంస్థ. ఇది జపాన్‌కు చెందిన టెరా డ్రోన్ కార్పొరేషన్ ఇండోనేసియా విభాగమని పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలు...
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఇరవై మంది సజీవ దహనమయ్యారు. ఇరవై మందిలో పదిహేను మంది పురుషులు, ఐదుగురు మహిళలున్నారు. అయితే ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కొందరి నుంచి ఫోన్లకు, మెయిల్స్ కు స్పందన రాకపోవడంతో వారి బంధువులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.
Next Story

