కంకికి 1000 గింజలు ఉండేలా.. మరో విప్లవమే!
వరి పంటకు సంబంధించి ప్రస్తుత కాలంలో కంకికి 150 నుంచి 200 గింజలు వస్తున్నాయి.

వరి పంటకు సంబంధించి ప్రస్తుత కాలంలో కంకికి 150 నుంచి 200 గింజలు వస్తున్నాయి. ఇక గత ఏడాది అక్టోబరులో విడుదలైన డీఆర్ఆర్ ధాన్ 75, 76 రకాల్లో వరి కంకికి 450 నుంచి 500 గింజలు వస్తున్నాయి. దీంతో ఎకరానికి 3.5 నుంచి 4.5 టన్నుల మేరకు ధాన్యం పండుతోంది. అయితే ఇప్పుడు అంతకు మించిన వంగడాలు రైతుల చెంతకు రాబోతున్నాయి. భారత వరి పరిశోధన సంస్థ ఐఐఆర్ఆర్ లో దీనికి రెట్టింపు స్థాయిలో వరి కంకికి వెయ్యి గింజలతో ఎకరానికి పది టన్నుల మేరకు భారీ ఉత్పత్తి సాధించే దిశగా కొత్త వంగడం సిద్ధమవుతోంది. ప్రాథమికంగా ప్రయోగాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తుది ఫలితాల అనంతరం మరో రెండేళ్లలో ఈ రకం అందుబాటులోకి రానుంది. తక్కువ కాలంలో సాగయ్యే సన్న రకంగా, తెగుళ్లను తట్టుకునేలా.. గ్లూకోజ్ శాతం తక్కువ ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. కంకికి వెయ్యి గింజలతో ఎకరానికి పది టన్నులు పండే వరి వంగడం 2027 డిసెంబరు నాటికి అందుబాటులోకి తేవాలని సంకల్పించామని ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం చైనాలో హైబ్రిడ్ వరి ఎకరానికి 6 టన్నులు వస్తోందని, ఈ కొత్త రకం దాన్ని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.