Tue May 06 2025 09:28:40 GMT+0530 (India Standard Time)
IPL 2025 : హైదరాబాద్ కథ ముగిసినట్లేనా? గుజరాత్ మళ్లీ కాలర్ ఎగరేసింది
అహ్మదా బాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీం పై విజయం సాధించింది

ఐపీఎల్ సీజన్ 18 ముగింపు దశకు చేరుకుంది. ఇక ప్లే ఆఫ్ రేసుకు ఏ జట్టు వస్తుందన్న దానిపై ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే రెండు మంచి టీంలు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోగా ఇప్పుడు తాజా ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ప్లే ఆఫ్ రేసుకు దూరమయిందనే చెప్పాలి. ఈ మూడు జట్లు గత సీజన్లో రఫ్ఫాడించాయి. చివరకు ఏ జట్టు ఫైనల్ కు వస్తుందా? అన్నంత రీతిలో సాగింది. కానీ అదే జట్లు. పెద్దగా మార్పులు లేకపోయినా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఈ జట్లు చతికలపడ్డాయి. నిన్న అహ్మదా బాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీం పై విజయం సాధించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో సమిష్టిగా రాణించడంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు మరింత దూరంగా జరిగినట్లయింది.
ఓపెనర్లు ఇద్దరూ...
తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టులో ఓపెనర్లు ఇద్దరూ శుభారంభాన్ని అందించారు. శుభమన్ గిల్, సుదర్శన్ లు ఇద్దరూ ఓపెనర్లుగా దిగి మంచి ఆరంభాన్ని అందించారు. సుదర్శన్ 48 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక శుభమన్ గిల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 76 పరుగులు చేయడంతో మంచి రన్ రేట్ వచ్చింది. బట్లర్ కూడా 64 పరుగులు చేసి జట్టుకు మరింత హైప్ తెచ్చాడు. వాషింగ్టన్ సుందర్ 21 పరుగులు, షారూఖ్ ఆరు పరుగులు చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లకు గాను ఆరు వికెట్లు కోల్పోయి 224 భారీ స్కోరు చేయగలిగింది. సన్ రైజర్స్ టీంలో ఉనద్కత్ మూడు, కమిన్స్, జీషన్ అన్సారీ చెరో వికెట్ తీయడంతో ఏదో అలా ముగించారు.
భారీ లక్ష్యంతో...
ఇక భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. హెడ్ ఇరవై పరుగులు చేసి వెనుదిరగగా, అభిషేక్ శర్మ మాత్రం 74 పరుగులు చేసి పరువు నిలిపాడు. ఇషాన్ కిషన్ పదమూడు పరగులు చేసి అవుట్ కాగా, క్లాసెన్ 23 పరుగులు చేసి వెనుదిరగడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కథ ముగిసినట్లయింది. మిగిలిన బ్యాటర్లలో నితీష్ కుమార్ 21, కమిన్స్ 19 పరుగులు చేయడంతో ఇరవై ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుమీద 38 పరుగులు తేడాతో విజయం సాధించినట్లయింది. గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ రేసులోకి దూసుకెళ్లగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లయింది.
Next Story