Tue May 06 2025 19:20:28 GMT+0530 (India Standard Time)
IPL 2025 : పింక్ సిటీలో రాయల్స్ కు మరో ఓటమి.. ప్లే ఆఫ్ కు దూసుకెళుతున్న ముంబయి
పింక్ సిటీ జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ముంబయి ఇండియన్స్ జట్టు సులువుగా గెలిచింది

రాజస్థాన్ రాయల్స్ ఎక్కడైనా సరై ఓటమి తప్ప దానికి మరొకటి తెలియకుండా ఉంది. ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు గా రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించిందనే చెప్పాలి. మంచి బలం ఉన్న జట్టు పేలవ ప్రదర్శనతో ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్ లలో వరసగా ఓటములను చవిచూసి చివరకు పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ముంబయి ఇండియన్స్ జట్టు మాత్రం పడి లేచిన కెరటంలా తొలుత అపజయాలు ఎదురైనా వరసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. నిన్న పింక్ సిటీ జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ముంబయి ఇండియన్స్ జట్టు సులువుగా గెలిచి ప్లే ఆఫ్ లో స్థానం సుస్థిరం చేసుకుంది.
మంచి ఆరంభంతో...
తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ జట్టులో ఓపెనర్లు రికిల్ టన్, రోహిత్ శర్మలు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ దూకూడుగా ఆడి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు మింగుడుపడలేదు. రికిల్ టన్ 61 పరుగులు చేసి అవుట్ కాగా, రోహిత్ శర్మ యాభై మూడు పరుగులు చేసి వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ గా నిలిచి మరోసారి 48 పరుగులు చేసి ముంబయి జట్టుకు మంచి పరుగులు సాధించి పెట్టాడు. ముంబయి ఇండియన్స్ జట్టు ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులోని బౌలర్లలో కేవలం రియాన్ పరాగ్ మాత్రమే ఒక్క వికెట్ తీయగలిగారంటే ఎంత పేలవ ప్రదర్శన చేసిందో ఇట్టే అర్థమవుతుంది.
అట్టర్ ప్లాప్...
అయితే తమకు అచ్చొచ్చిన మైదానమైన జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ స్కోరును తేలిగ్గా ఛేదిస్తుందని అనుకున్నారు. ఎందుకంటే బలమైన బ్యాటింగ్ జట్టు ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏదో ఊదిపారేస్తుందని అనుకుంటే చతికిలపడ్డారు. యశస్వి జైశ్వాల్ ఈ సీజన్ లో పెద్దగా రాణించలేదు. కేవలం పదమూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అంతకు ముందు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ డకౌట్ తో వెనుదిరిగాడు. నితీష్ రాణా తొమ్మిది పరుగులు, రియాన్ పరాగ్ 16, ధ్రువ్ జురెల్ పదకొండు, , హెట్ మయర్ జీరోతో అవుటయ్యారు. శుభమ్ దూబె పదిహేను, ఆర్చ్ 30 పరుగులు చేసినా అప్పటికే రన్ రేట్ పెరిగి పోయింది. దీంతో 16.1 ఓవర్లకే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆల్ అవుట్ అయి 117 పరుగులు మాత్రమే చేసింది. అంటే ముంబయి ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు వంద పరుగుల తేడాతో ఓటమి పాలయింది.
Next Story