Tue Jul 22 2025 03:07:30 GMT+0530 (India Standard Time)
BRS : హరీశ్ అన్నా.. ఒక్క ఎకరా భూమి ఇప్పించవూ.. సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో సవాళ్లు వినిపిస్తున్నాయి

రాజకీయాలన్నాక మాటలు మాట్లాడితే సరిపోదు. వాస్తవ పరిస్థితులు చెప్పాలి. కానీ తమ పార్టీ ప్రయోజనాలను, ప్రత్యర్థులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలంటే బురద చల్లడం ఒక్కటే మార్గం. తాము చెప్పిన మాటలు వంద మందిలో పది మంది అయినా నమ్ముతారని కావచ్చు. తాజాగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన కామెంట్స్ కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో పది ఎకరాల భూమి వచ్చేదని, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సీన్ రివర్స్ అయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో రెండు ఎకరాల భూమి వస్తుందని హరీశ్ రావు అన్నారు.
నాడు చంద్రబాబు కూడా...
అయితే 2019 నుంచి 2024 వరకూ ఆంధ్రప్రదేశ్ లోనూ అక్కడ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఇదే మాట మాట్లాడారు. ఏపీలో నాలుగు ఎకరాల భూమి అమ్మితే తెలంగాణలో ఎకరం భూమి వస్తుందని పదే పదే ఆయన ఎన్నికల ప్రచారంలోనూ పదే పదే చెప్పారు. అయితే హారీశ్ రావు తెలంగాణలో ఎక్కడ భూముల ధరలు తగ్గాయో చెప్పాలని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భూముల ధరలు ఎక్కడ పెరిగాయో చెప్పాలని, అలాగే తెలంగాణలోనూ తగ్గిన భూముల ధరలు ఎక్కడో చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్ లో భూముల ధరలు ఏమాత్రం తగ్గలేదని చెబుతున్నారు.
మారుమూల ప్రాంతంలోనూ...
అలాగే తెలంగాణలోనూ మారుమూల ప్రాంతాల్లో భూముల ధరలు ఏమాత్రం తగ్గలేదని, కేవలం ప్రచారం చేసినంత మాత్రాన జనం నమ్మరని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. దమ్ముంటే తమ సవాల్ కు సిద్ధం కావాలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పది ఎకరాల భూమిని అమ్ముదామని, ఇక్కడ ఆ సొమ్ముతో కనీసం రెండు ఎకరాలు కొంటే తాము పదవులకు రాజీనామా చేస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. హరీశ్ రావు ఊదర గొట్టే మాటలు మానుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో కంటే ఇప్పుడు భూముల ధరలు రెట్టింపయిన విషయాన్ని మీకు అత్యంత సన్నిహితులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులన కనుక్కోవాలంటూ సోషల్ మీడియాలో సవాల్ విసురుతున్నారు.
Next Story