సిజేరియన్ ప్రసవాలు.. తెలంగాణదే మొదటి స్థానం
తెలంగాణ రాష్ట్రంలో సహజ ప్రసవాలు తగ్గుతున్నాయి. ఎంతలా అంటే దేశంలోనే సిజేరియన్ ప్రసవాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో సహజ ప్రసవాలు తగ్గుతున్నాయి. ఎంతలా అంటే దేశంలోనే సిజేరియన్ ప్రసవాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. రాష్ట్రంలో ప్రతి గంటకు 27 సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మే, జూన్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 67వేల 103 ప్రసవాలు జరగ్గా.. అందులో 39వేల 300 సిజేరియన్లే ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 73 శాతానికి పైగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 48 శాతం సిజేరియన్ ప్రసవాలే ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. ప్రధానంగా 8 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70 శాతం ప్రసవాలు సిజేరియన్లేనని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ఇచ్చిన తాజా నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు పెరిగిపోతుండడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సీ సెక్షన్ ప్రసవాలపై ఆడిట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను చేపట్టారు. 30 దాటిన తర్వాత గర్భం దాల్చిన వారిలో సాధారణ ప్రసవం జరగడం కష్టమేనని, అలాంటప్పుడు సిజేరియన్‌కే వైద్యులు ప్రాధాన్యమిస్తారని నిపుణులు తెలిపారు.