Tue May 06 2025 06:56:20 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రెండేళ్లు కీలకం... కష్టపడకపోతే.. అందరికీ నష్టమేనంటూ రేవంత్ మళ్లీ వార్నింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు

గాయం ఎక్కడ ఉందో అక్కడే మందు వేయాలి. లేదంటే శరీరం మొత్తం పాకుతుంది. గాయం తగిలిన ప్రాంతం సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ కూడా చేయించాలి. లేదంటే ఏకంగా గాయమయిన చేతినే తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వైద్య పరిభాష అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ కు ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా.. ఇచ్చిన హామీలను ఎన్ని అమలు చేస్తున్నా.. డ్యామేజీ అయ్యేది ఎమ్మెల్యేల వల్లనే. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం చివరకు ఎన్నికలకు వచ్చే సరికి పార్టీ అధికారంలోకి దూరమయ్యే అవకాశముంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
కాంగ్రెస్ ను బలోపేతం చేయడంపై...
అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒకవైపు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు ఎమ్మెల్యేలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరగాల్సిందేనని సీఎల్పీ సమావేశంలో గట్టిగా హెచ్చరించిన రేవంత్ రెడ్డి వారు హైదరాబాద్ లో ఉండటాన్ని గుర్తించి వారితో సమావేశమై నియోజకవర్గాల సమస్య గురించి తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడం ప్రారంభమైతే రెండేళ్లలో పార్టీ పుంజుకునే అవకాశముంటుందని భావిస్తున్నారు.
సొంత జిల్లా ఎమ్మెల్యేలతో...
ముందుగా మహబూబ్ నగర్ జిల్లాతోనే ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమీక్షను ప్రారంభించారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును గురించి కూడా కూపీ లాగారు. ఎక్కడెక్కడ తిరిగారు? ఎన్ని సమావేశాలు నిర్వహించారు? అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గాల సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారా? లేనిదీ తెలుసుకున్నారు. నియోజకవర్గానికి నిధుల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయని, వాటిని ఏ ఏ పనులకు ఖర్చు చేశారంటూ ఎమ్మెల్యేలను సూటిగా ప్రశ్నిస్తున్నారు.
కలుపుకుని వెళ్లడంపై...
అంతేకాకుండా నియోజకవర్గాల్లో పార్టీలో అందరినీ కలుపుకుని వెళుతున్నారా? లేదా? అన్నది కూడా రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను సూటిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. అందరినీ కలుపుకుని వెళితేనే మరోసారి విజయం లభిస్తుందని, అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటే తప్ప ప్రజలు మరోసారి దీవించరని కూడా కాస్త కటువుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాదయాత్రలు కూడా ఎక్కడకక్కడ నియోజకవర్గాల్లో చేపట్టి సమస్యలను గుర్తించి, ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా ఆదేశించారు. ఎమ్మెల్యేలకు తాను ఏం కావాలన్నా చేస్తానని, నిధుల విషయంలో ఆలోచన పెట్టుకోవద్దని, తనను నేరుగా కలిసి చెబితే వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు ఇకపై నియోజకవర్గాలకే పరిమితం కావాలని, ఈ రెండేళ్లు కీలకమని రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. వరసగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవుతారని తెలిసింది. సో.. ఎక్కడ వీక్ గా పార్టీ ఉందో గుర్తించి అక్కడ రేవంత్ సెట్ రైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే కనపడుతుంది.
Next Story