Wed Dec 10 2025 11:00:39 GMT+0530 (India Standard Time)
Weather Report : ఎముకలు కొరికే చలి.. మరో వారం రోజులు ఇంతేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగిపోతుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగిపోతుంది. ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ఫలితంగా చలిగాలుల తీవ్రత రానున్న కాలంలో మరింతగా పెరుగుతందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా చలిగాలులు తీవ్రమైన సమయంలో శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా తగినంత నీరు తాగాలని కోరుతున్నారు. చలిగాలుల వల్ల నీరు తాగకపోతే డీ హైడ్రేషన్ కు గురయి అస్వస్థతకు గురవుతారని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని అంటున్నారు.
ఏపీలో తగ్గిన ఉష్ణోగ్రతలు...
గత నాలుగైదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లోనూ చలిగాలుల తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలకు అనేక ప్రాంతాలు చేరుకోవడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంది. అరకు ఏజెన్సీలో అత్యల్పంగా 3.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగులలో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లంబసింగిలోనూ ఎముకలు కొరికే చలి ఉంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగుతుందని అంటున్నారు.
తెలంగాణలో మరింత ఎక్కువగా...
తెలంగాణలో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మరో ఆరు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు చలి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం పది గంటల వరకూ దట్టమైన పొగమంచు కమ్ముకుంటూనే ఉంది. అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి చీకట్లు అలుముకుంటున్నాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కూడా చలి, పొగమంచుతో అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 16వ తేదీ వరకూ చలిగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది
Next Story

