Tue May 06 2025 08:19:21 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రేవంత్ మాటలను లెక్క పెట్టడం లేదా? హైకమాండ్ కు రిపోర్టు వెళ్లనుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను ఎమ్మెల్యేలు పాటించడం లేదు. ఆయన చెప్పిన విషయాలను అమలు చేయడం లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదా? ఆయన ఎన్ని చెప్పినా ఎమ్మెల్యేలు తమ మొద్దు నిద్ర వీడటం లేదా? అంటే అవుననే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలు ఏ పార్టీలో ఉండవు. అందుకే కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలను, నేతలను డీల్ చేయడం అంత సులువు కాదు. వారిని కార్మోన్ముఖులను చేయడం అంత తేలిక కాదు. గెలిచిన ఐదేళ్ల పాటు పదవిని అనుభవించాలన్న ధోరణి మాత్రమే ఎక్కువగా కనపడుతుంటుంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో ప్రాంతీయ పార్టీల తరహాలో పార్టీ చీఫ్ పై ఆధారపడి గెలుపోటములు ఆధారపడి ఉండవు. కాంగ్రెస్ లో ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు గమనిస్తుంటారు.
సీఎల్పీ సమావేశంలో...
ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఈ నెల పదిహేనో తేదీన జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు పూర్తి క్లారిటీ ఇచ్చారు. రేపటి నుంచి నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. తాను కూడా మే 1 తేదీ నుంచి జిల్లాలతో పాటు నియోజకవర్గాలను పర్యటిస్తానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ పదిహేడు నెలల కాలంలో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని,దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్న ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన లాంటి సమస్యను పరిష్కరించి చరిత్ర సృష్టించామని వాటిని ప్రజల్లోకి బలంగా ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో పాటు అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని కూడా ప్రజలకు వివరించాలని, అందుకు ఎమ్మెల్యేలు జనం బాట పట్టాలని పిలుపు నిచ్చారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి...
మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా నిధుల విడుదలతో పాటు సన్నబియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఇందిరమ్మఇళ్లు, కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తున్నా సరైన రీతిలో ప్రజల్లోకి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుంది. తెలుపు రంగు రేషన్ కార్డు దారులకు సన్న బియ్యంతో సరికొత్త అధ్యాయం మొదలు పెట్టినా దానిపై పెద్దగా ప్రచారం లేదు. ఉద్యోగ నియామకాల్లో తొలి ఏడాదిలో రికార్డు సృష్టించినట్లు ప్రభుత్వం చెబుతున్నా అది ప్రజల వరకూ చేరడం లేదు. అయితే ఇందుకు కాంగ్రెస్ నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా జనంలో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తే తప్ప పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితులు రావు.
పదిహేను రోజులవుతున్నా...
కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాలకు వెళ్లమని చెప్పి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా ఏ ఒక్కరూ ఆ దిశగా నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉంటూ పనులు చేయించుకుంటూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు. వీకెండ్ లో మాత్రం నియోజకవర్గం ప్రధాన కేంద్రానికి వెళ్లి అలా పలకరించి వస్తుండం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. అందువల్లనే ఎమ్మెల్యేల పనితీరుపై రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఈ మేరకు హైకమాండ్ కు కూడా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేసినా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు అయినా సరే ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మారతారా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి.
Next Story