Tue Jul 22 2025 02:54:41 GMT+0530 (India Standard Time)
Congress : రేవంత్ కామెంట్స్ లో అర్థమదేనా? పదేళ్లు తనను ఎవరు కదల్చరన్న నమ్మకమేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా కలకలం రేపుతున్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా కలకలం రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ పదేళ్ల వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా తానే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చెప్పడంపై కాంగ్రెస్ లో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు బయటపడుతుండగా, మరికొందరు మాత్రం లోలోపల ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరు అన్నది నిర్ణయించాల్సింది హైకమాండ్ మాత్రమే. హైకమాండ్ నిర్ణయం మేరకే ఎమ్మెల్యేలు ఎన్నికలు జరిగిన తర్వాత శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. కాని అందుకు విరుద్ధంగా మాట్లాడటం కొందరు తప్పుపడుతుండగా, ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు మాట్లాడటంలో తప్పేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
పదేళ్ల పాటు తానే సీఎం అంటూ...
అయితే తాను మాత్రం పదేళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చెప్పడాన్ని కొందరు తీవ్రంగా తప్పుపడుతున్నారు. సీనియర్ నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బయటపడింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే కావచ్చు. రాజగోపాల్ రెడ్డి అంటే ఒకింత అసంతృప్తిగా ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ మంత్రులు కొందరు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడి చివరకు అధిష్టానం నిర్ణయంతో మంత్రులుగా మారారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు కొందరయితే... సామాజికవర్గం కోణంలోనూ మరికొందరు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి అదృష్టం కొద్దీ వరిస్తుంది. అంతే తప్ప అది శాశ్వతం అని భావించకూడదని సీనియర్ నేతలు కూడా చెబుతున్నారు.
సీఎంలను మార్చే సంప్రదాయం...
గతంలో ఇలా తామే ముఖ్యమంత్రి అనుకున్న వారు సయితం కనీసం మంత్రి పదవిని కూడా దక్కించుకోలేకపోయారన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తనపై తనకున్న విశ్వాసంతో ఆ మాట అని ఉండవచ్చు. ఇటీవల కాలంలో రాహుల్ జమానాలో ముఖ్యమంత్రులను అంతతేలిగ్గా మార్చే సంప్రదాయానికి కాంగ్రెస్ తెరదించింది. గతంలో మాదిరిగా సీఎంలను వెంట వెంటనే మార్చే సంస్కృతి లేదు. కర్ణాటకలో సిద్ధరామయ్యను చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. డీకే శివకుమార్ వంటి బలమైన నేత పోటీపడినా చివరకు సిద్ధరామయ్యనే కర్ణాటక సీఎంగా మరోసారి కొనసాగించడాన్ని రేవంత్ సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.
బీసీలు అధికంగా ఉన్నా...
తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఇటీవల కాలంలో బీసీ ముఖ్యమంత్రి అంటూ నినాదం ఎక్కువయింది. గత ఎన్నికల్లోనే బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని అందుకుంది. అయితే తెలంగాణలో రెడ్ల సామాజికవర్గం పెత్తనంతో పాటు పార్టీని గెలిపించే సత్తాతో పాటు అధికారాన్ని తెచ్చిపెట్టే వర్గంగా ముద్రపడింది. అందుకే రేవంత్ రెడ్డి తరుపున నేతలు ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని? ప్రత్యర్థులను బలంగా ఎదుర్కొనడంలోనూ, వారికి ధీటుగా కౌంటర్లు ఇవ్వడంలో ముందుండే రేవంత్ నాయకత్వం వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందంటున్నారు. అదే సమయంలో అంత మాత్రాన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే ప్రయత్నం చేయడమేంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహా రాజకీయాలు చేయాలని రేవంత్ ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని కూడా మరికొందరు అంటున్నారు. మొత్తం మీద రేవంత్ తాజా వ్యాఖ్యలను పార్టీలో కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
Next Story