Tue May 06 2025 08:05:35 GMT+0530 (India Standard Time)
Congress : కాంగ్రెస్ నేతలకు మింగుపడని మీనాక్షి
రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేతలకు మింగుడుపడటం లేదు

రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేతలకు మింగుడుపడటం లేదు. ఆమె భిన్నమైన నేత. గతంలో మాదిరిగా ఇన్ ఛార్జులుగా వ్యవహరించిన వారి తరహా కాదు. మీనాక్షి నటరాజన్ రూటే సపరేటు. పార్టీని బలోపేతం చేయడమే మీనాక్షి ముందున్న లక్ష్యం. అందుకోసం ఆమె ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. మొహమాటాలు లేవు. తనకు అప్పగించిన బాధ్యతను పకడ్బందీగా పూర్తి చేయడమే ఆమె కర్తవ్యం. ఒక రకంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారన్నది వాస్తవం. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి నేతల వరకూ మీనాక్షి నటరాజన్ ఒకే విధానం అవలంబిస్తూ పార్టీలో హాట్ టాపిక్ గా మారారు.
ఎవరికీ భయపడకుండా...
మీనాక్షి నటరాజన్ ఇటీవల హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వివాదంలో సచివాలయంలో మంత్రులతో సమావేశం జరిపిన ఘటన వివాదం అయినప్పటికీ ఆమెకు అధినాయకత్వం అప్పగించిన బాధ్యతను పూర్తి చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని టెన్ జన్ పథ్ కు నేరుగా నివేదిక అందించారని తెలిసింది. అందుకే మీనాక్షి నటరాజన్ ఎవరికీ భయపడరు. వెరవరు. ఆమెకు అందరూ భయపడాల్సిందే. అలాగని చేతులు కట్టుకుని గులాం గిరీ చేయాల్సిన పనిలేదు. మీనాక్షి ముందు మోకరిల్లాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆమె కు వాస్తవ పరిస్థితులు చెబితే చాలు. వెంటనే వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో కొందరు మాత్రం హ్యాపీగానే ఉన్నారు.
క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని...
ఇటీవల మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణ అవసరం అని గుర్తించిన ఆమె ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా గాంధీభవన్ లో జరిగిన సమావేశానికి నియోజకవర్గాల పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిపై అప్పటికప్పుడు వేటు వేశారు.వారిని పరిశీలకుల పదవి నుంచి తొలగించారు. ఎమ్మెల్యేలు అని కూడా చూడలేదు. గీత దాటితే వేటు తప్పదంటూ స్ట్రాంగైన హెచ్చరికను పంపగలిగారు. ఈ సమావేశానికి హాజరుకాని అందరు పరిశీలకులను తొలగించి తాను ఇంతే అన్నట్లు మీనాక్షి నటరాజన్ హస్తం పార్టీనేతలకు ఝలక్ ఇచ్చారు.అయితే 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించిన మీనాక్షి నటరాజన్ కమిటీలో వారికే చోటు కల్పించాలని భావిస్తున్నారు. మొత్తం మీద మీనాక్షి నాటరాజన్ దెబ్బకు కాంగ్రెస్ నేతలు కంగు తింటున్నారు.
Next Story