ఇంగ్లండ్ నుండి వచ్చిన ఈ సైకిల్ కు 75 ఏళ్ల చరిత్ర
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రావికంటి సురేందర్ దగ్గర ఉన్న సైకిల్ కు 75 ఏళ్ల చరిత్ర ఉంది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రావికంటి సురేందర్ దగ్గర ఉన్న సైకిల్ కు 75 ఏళ్ల చరిత్ర ఉంది. సురేందర్ తాత శంకరయ్య 1950లో స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహించేవారు. అప్పట్లో ఇంగ్లండ్ నుంచి ఈ హెర్క్యులస్ సైకిల్ ను తెప్పించుకున్నారు. శంకరయ్య తదనంతరం ఆయన కుమారుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాంబయ్య ఇదే సైకిల్ మీద జమ్మికుంట పరిధిలోని మోత్కులగూడెం, కేశవపూర్, ఆబాది జమ్మికుంట, జమ్మికుంట పాఠశాల లకు వెళ్లేవారు. సురేందర్ పార్ట్ టైమ్ అధ్యాపకుడిగా చేరినప్పుడు 1990లో ఈ సైకిల్ ఆయన చేతికి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 2002లో శాశ్వత ఉద్యోగం వచ్చినా కూడా దీన్నే వాడుతూ ఉన్నారాయన. స్కూటీ వంటివి కొనుక్కోమని ఎంతో మంది చెప్పినా కూడా ఆయన సైకిల్ మీదే సవారీ చేశారు. జమ్మికుంట మండలం లో ఆయన పని చేసే పాఠశాలలకు దీనిపైనే రోజూ 12 కిలోమీటర్లు వెళ్లేవారు. 2020లో ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ఆయన పలు అవసరాలకు ఇదే సైకిల్ వాడుతున్నారు. ఇంగ్లాండ్ నుండి తెప్పించిన తర్వాత చిన్నచిన్న మరమ్మతులు మినహా పెద్దగా మార్పులేమీ చేయలేదని సురేందర్ చెప్పారు. ఈ సైకిల్ ఆ ప్రాంతంలో ఓ చిన్న సెలబ్రిటీ అనే చెబుతారు.