Tue May 06 2025 11:40:28 GMT+0530 (India Standard Time)
Telangana : ఆర్టీసీ సమ్మె సబబేనా? కేసీఆర్ విధానమే కరెక్టా? సోషల్ మీడియాలో రచ్చ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సమయం దగ్గర పడింది. ఈ నెల 7 నుంచి సమ్మె ప్రారంభం కానుంది.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సమయం దగ్గర పడింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాలు ఈ నెల 7వ తేదీన సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోవడంపై సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సమ్మె కోసం సన్నద్థత ర్యాలీని కూడా నిర్వహించారు. విధిలేని పరిస్థితుల్లో తాము నోటీసులు ఇచ్చామని, మంగళవారం రాత్రి నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని ఆర్టీసీ కార్మిక సంఘాలు నేతలు ప్రకటించారు. తమ సమ్మెకు సహకరించాలంటూ సంఘ నేతలు ప్రజలను కోరారు. మే 7వ తేదీ నుంచి తాము తలపెట్టిన సమ్మె యధాతధంగా కొనసాగుతుందని తెలిపారు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే...
నిజానికి తెలంగాణ ఆర్టీసీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి కార్మికసంఘాలు యాక్టివ్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చినహామీలను అమలు చేస్తున్నామని, అలాగే ఆర్టీసీ కార్మికులకు కూడా త్వరలో వారి డిమాండ్లను పరిష్కరిస్తామని చెబుతుంది. చర్చలకు రావాలని ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పిలుపు నిచ్చారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాలు పడుతుందని, ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం మరింత సంస్థపై భారం మోపేలా చేస్తుందని ప్రభుత్వం నుంచి వాదన వినిపస్తుంది. కొన్నిరాజకీయ పార్టీల అనుబంధ సంఘాల కార్మికులు మాత్రమే సమ్మెకు దిగుతున్నారని, వారు రెచ్చగొట్టడం వల్లనే సమ్మెకు దిగుతున్నారని ప్రభుత్వం భావిస్తుంది. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా సమ్మెకు దిగడమేంటని ప్రభుత్వం గట్టిగానే ప్రశ్నిస్తుంది.
సమ్మెకు దిగితే నష్టమెవరికి?
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ప్రజలు ఇబ్బందులు పడతారు. దాని వల్ల ప్రభుత్వానికి కొంత చెడ్డపేరు వస్తుంది. దానిని ఆశించిన కొందరు రాజకీయ పార్టీల నేతలు ఆర్టీసీ కార్మికసంఘాలను రెచ్చగొట్టి సమ్మె వైపు నడిపిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. కార్మిక సంఘాలతో చర్చలు చేయడానికి తాము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని, వారు ఎప్పుడైనా వచ్చి తమతో మాట్లాడవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినా మొండి తనంతో సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే నష్టపోయేది ప్రజలు మాత్రమే కాదని, కార్మికులు కూడా అని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామని, ఏదైనా ఉంటే చర్చలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చినా రాకుండా సమ్మెకు దిగడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెల మొదటి తేదీన జీతం ఇస్తున్నందుకు సమ్మెకు దిగుతున్నారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా అంటు నిలదీశారు.
కేసీఆర్ హయాంలో ఏం జరిగింది?
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలకు కేసీఆర్ వంటివారు అవసరమన్నఅభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వ్యక్తమవుతుంది. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు కేసీఆర్ ఏం చేశారన్నది మర్చిపోయారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఆర్టీసీ కార్మిక సంఘాలను కూడా రద్దు చేసిన చరిత్ర కేసీఆర్ ది అని, అలాంటి కేసీఆర్ లాంటి నేతలే వీరికి అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. నాడు సమ్మె అంటేనే కేసీఆర్ ప్రభుత్వంలో కఠినంగా వ్యవహరించిన విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒంటికాలిపై లేవడం దేనికంటూ నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చులకనగా మారిపోయి కార్మిక సంఘాలు కొందరు చెప్పినట్లు నడుస్తున్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కార్మికులు తమ సమస్యలను పరిష్కారం కావాలంటే ప్రభుత్వం వద్దకు వెళ్లి చర్చించాలని, అంతే తప్ప చర్చలకు వెళ్లకుండా సమ్మెకు వెళతామని ప్రకటిస్తే నష్టపోయే దానిలో ఆర్టీసీ కార్మికులు కూడా ఉంటారని హెచ్చరిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో యాభై రెండు రోజులు...
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే ప్రభుత్వం అప్పట్లో చర్చలకు కూడా పిలవలేదు. దాదాపు యాభై రెండు రోజుల పాటు సమ్మె కొనసాగింది. కార్మికులు రెండు నెలల పాటు జీతాలు లేక ఇబ్బందులు పడ్డారు. 2019 అక్టోబరు 4వ తేదీన అర్ధరాత్రి నుంచి ప్రారంభమయిన సమ్మె సుదీర్ఘంగా కొనసాగింది. నాడు తెలంగాణలో ముఖ్యమైన దసరా పండగకు వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం మాత్రం కార్మిక సంఘాల డిమాండ్లకు తలొంచలేదు. మూడు రోజుల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే నవంబరు 25న కార్మిక సంఘాలు సమ్మెను ముగించాయి. నాడు రెండు రోజుల పాటు సమ్మెలోకి దిగిన కార్మికులను విధుల్లోకి అనుమతించకపోవడాన్ని కూడా నేడు కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.తర్వాత అదే కేసీఆర్ ఆర్టీసీ కార్మిక సంఘాలను తన ఇంటికి భోజనాలను పిలిచి వారి డిమాండ్లలో కొన్నింటిని తీర్చారు. ఇప్పుడు కూడా అలాంటి సమస్యలను కొని తెచ్చుకోవద్దని కొందరు సూచిస్తున్నారు. తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగడంలో తప్పులేదని, అదే సమయంలో ప్రజలకు జరిగే నష్టంతో పాటు ప్రభుత్వ ఆర్థికపరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
Next Story