అక్టోబర్లో ₹5,726 కోట్లు జీఎస్టీ; తెలంగాణకు పండుగ బూస్ట్
దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు 10 శాతం ఎక్కువ

తెలంగాణ రాష్ట్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో దేశంలో అగ్రరాజ్యాల సరసన నిలిచింది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ అక్టోబర్లో రాష్ట్రం 10 శాతం వృద్ధిని సాధించింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తెలంగాణ అక్టోబర్లో ₹5,726 కోట్లు జీఎస్టీగా వసూలు చేసింది. ఇదే వృద్ధిరేటును కర్ణాటక కూడా నమోదు చేసింది. దసరా, దీపావళి పండుగల సీజన్లో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో రాష్ట్రానికి రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గత సంవత్సరం ఇదే నెలలో ₹5,211 కోట్లు వసూలు కాగా, ఈసారి ₹515 కోట్ల పెరుగుదల నమోదైంది.
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ₹1,45,052 కోట్లకు చేరగా, ఇది 2 శాతం వృద్ధిగా ఉంది. ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ) సెటిల్మెంట్ల కింద తెలంగాణకు ఈ ఏడాది అక్టోబర్ వరకు ₹26,334 కోట్లు బదిలీ అయ్యాయని, ఇది గత ఏడాది ₹25,306 కోట్లతో పోలిస్తే 4 శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది.
నవంబర్ కీలక పరీక్షగా భావన
ఆర్థిక నిపుణులు నవంబర్ వసూళ్లు కీలక సూచీగా ఉంటాయని పేర్కొన్నారు. “పండుగ సీజన్ అమ్మకాలు రేటు తగ్గింపుల వల్ల కలిగే నష్టాన్ని తాత్కాలికంగా సమతుల్యం చేశాయి. నవంబర్ గణాంకాలు ఈ ధోరణి కొనసాగుతుందో లేదో చూపిస్తాయి’’ అని ఒక ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానించారు.
రేటు తగ్గింపును పండుగ అమ్మకాలు భర్తీ చేశాయి
గత నెల 22న జీఎస్టీ కౌన్సిల్ కొన్ని వస్తువుల పన్ను రేట్లను 12%, 28% నుంచి వరుసగా 5%, 18%కు తగ్గించింది. దీంతో 90% వస్తువులు తక్కువ పన్ను శ్రేణిలోకి వచ్చాయి. వినియోగదారులకు ఉపశమనం కలిగించినా, ప్రభుత్వ ఆదాయంపై కొంత ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్స్, వాహనాలు, దుస్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు పెరగడంతో తెలంగాణ వసూళ్లు మెరుగుపడ్డాయి. “తగ్గిన పన్ను రేట్లను అధిక కొనుగోళ్లు భర్తీ చేశాయి’’ అని నిపుణులు తెలిపారు.
అధికారులు నవంబర్లో వసూళ్లు ₹5,200 కోట్లు దాటితే రేటు తగ్గింపుల ప్రభావం తక్కువగానే ఉంటుందని, కానీ వసూళ్లు ₹4,998 కోట్లకు సమీపిస్తే ప్రభావం స్పష్టమవుతుందని అంచనా వేస్తున్నారు.

