Tue May 06 2025 08:22:56 GMT+0530 (India Standard Time)
Visakha : విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. నేడే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
విశాఖ వాసులకు మరొక గుడ్ న్యూస్ నేడు అందనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖలో మరో ప్రాజెక్టు నేడు ప్రారంభం కానుంది

విశాఖ వాసులకు మరొక గుడ్ న్యూస్ నేడు అందనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖలో మరో ప్రాజెక్టు నేడు ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన యూనిటీ మాల్‌ను విశాఖలోని మధురవాడలో నిర్మించ తలపెట్టారు. ఈ యూనిట్ మాల్ కు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో రుషికొండ రూపురేఖలు మారనున్నాయి. మధురవాడలో నిర్మించే ఈ యూనిట్ మాల్ కు 172 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. 172 కోట్ల రూపాయలతో జీ+4 అంతస్తులతో దీన్ని నిర్మించనున్నారు. తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం ఎనభై ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో...
ఇప్పటికే విశాఖలోని యూనిటీ మాల్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు ప్రధాని మోదీ జీ చంద్రబాబు నాయుడుతో కలిసి యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 2026 మార్చి నాటికి మాల్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం 172 కోట్లను 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. ఈ యూనిటీ మాల్ ను విశాఖలోని మధురవాడలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. దీంతో విశాఖకు మరో కీలకమైన ప్రాజెక్టు దక్కినట్లయింది.
సీ వ్యూ ఏర్పాటు చేసి...
మధురవాడ రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 426/2లోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ మాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రుషికొండ బీచ్‌కు కేవలం కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని ఈ మాల్ ను నిర్మించనున్నారు. జీ+4 అంతస్తులోని మొదటి, రెండు అంతస్తుల్లో అరవై రెండు దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్, భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు వీటిని కేటాయించనున్నారు. మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్, రెండు మినీ థియేటర్లు ఉంటాయి. రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ ఔట్లెట్లు, వినోద సదుపాయాలు, ఫిట్నెస్ సెంటర్లు, బ్యాంకు శాఖలు, ఫర్నిచర్ స్టోర్లు కూడా రానున్నాయి. వీటిపై వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా తీర్చనుంది. సో.. ఇది విశాఖ వాసులకు గుడ్ న్యూస్ కాక మరేముంటుంది?
Next Story